Thursday, November 14, 2024

Special Story – అల్లూరి సీతా రామరాజు జిల్లాలో ప్రకృతి సోయగాలు చూడతరమా..

సెలయేటికి చలో… అందాల అడవమ్మ..!
ప్రకృతి సోయగాలు చూడతరమా..
అల్లూరి సీతా రామరాజు జిల్లాలో పర్యాటక ప్రదేశాలెన్నో..
సహజ సిద్దంగా ఏర్పడిన జలపాతాలు
జిల్లాలో పదిహేనుకుపైగా సెలయేళ్లు..
జలపాతాల్లో జలకాలాడాల్సిందే…
ప్రకృతి అందాలు వీక్షించేందుకు వస్తున్న పర్యాటకులు

ఇదీ కార్తీక శోభ శుభ తరుణం.. కొండ కోనల్లో.. లోయల్లో వెలి మంచు వెలిసిన వేళ, ఘల్లు ఘల్లున అందెలు రవంతో పకృతి కన్య అడుగుల సవ్వడికి గుండె జల్లుమనాల్సిందే. ఎందుకంటే.. ఇప్పుడిప్పుడే చలి చలిగా గిలిగిలిగా నిద్రావస్థ నుంచి మేల్కొని ఆవులించే క్షణాల్లో… పచ్చని మేనితో రంగురంగుల వాలు పూల జడలో ఈ అడవి బిడ్డ అడుగులో అడుగేస్తుంటే.. కోయిలమ్మ పిలుపులు.. గువ్వల గుసగుసలు.. పిట్టల కిలకిలారావాలు, కోతి బావల కిచకిచల పలకరింపు… గలగలా వాగులు పరుగులు ఈ అనుభూతి ఓ అద్బుతం. కలానికి దొరకని కవి మది ఘోష ఇది. ఈ సుందర దృశ్యమాలికను కనులారా వీక్షించాలంటే.. అల్లూరి సీతారామ రాజు జిల్లాలో పర్యటించాల్సిందే. తరులు, గిరులు, ఝరుల సాక్షిగా వాగుల్లో వంకల్లో జలపాతాల్లో జలకాలాడాల్సిందే. తనివితీరా ఆస్వాదించాల్సిందే.

ఆంధ్రప్రభ స్మార్ట్, చింతూరు (ఏఎస్‌ఆర్‌ జిల్లా) ప్రకృతి రమణీయ సోయగాల నడుమ అడవి తల్లి ఒడిలో రాతి బండల మీద నుంచి జాలువారే జలపాతాలు, జల తరంగణీల్లో పర్యాటకులను మైమరచిపోతారు. అల్లూరి సీతారామారాజు జిల్లాలోని 22 మండలాల్లో 15 పైగా పేరుగాంచిన జలపాతాలు పకృతి ప్రేమికుల మదిని దోచేస్తున్నాయి. ప్రకృతి ఒడిలోని ఈ జలపాతాల అందాలను ఆస్వాదిస్తూ పర్యాటకులు మంత్రముగ్ధులవుతున్నారు. ప్రశాంత వాతావరణం, స్వచ్ఛ‌మైన గాలి, దట్టమైన అభయారణ్యంలో పెద్ద పెద్ద కొండలు, రాతి బండలపై నుంచి సన్నగా జాలువారే జలధారను కనులారా వీక్షించి కుర్రకారు కేరింతలు కొడుతుంటే.. గుర్తు కొస్తున్నాయంటూ సీనియర్ సిటిజన్లు గొప్పలు పోతూ ఆనంద డోలికల్లో తేలిపోతుంటారు.

- Advertisement -

తారాబులో తన్మయం

పెదబయలు మండలం జామిగూడ పంచాయతీలోని ఈ జలపాతం ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఎత్తైన కొండల నుంచి జాలువారుతున్న జలపాతం హొయలు చూసి పర్యాటకులు మైమరచిపోతున్నారు. ప్రకృతి ఒడి నుంచి సహజ సిద్దంగా ఏర్పడిన తారాబు జలపాతం సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటోంది. సుమారు 500 అడుగుల పైనుంచి జాలు వాడుతున్న నీటి ప్రవాహాన్ని తనివి తీరా ఆస్వాదిస్తూ ఆనంద డోలికల్లో తారాబు జలపాతంలో పర్యాటకులు తన్మయత్వంలో మునిగి తేలుతున్నారు. ఎంతో కష్టపడి తారాబు జలపాతానికి చేరుకుంటున్నారు. అయితే అక్కడ ప్రకృతి సౌందర్యం నడుమ తారాబు జలపాతాన్ని చూసి తాము పడిన శ్రమను సైతం మర్చిపోతున్నారు. ఈ జలపాతాన్ని పిట్టలబొర్రా జలపాతం అని కూడా అంటారు. ఈ ప్రాంతానికి మన రాష్ట్రంతో పాటు ఛ‌త్తిస్‌గ‌ఢ్‌, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాల పర్యాటకులు వస్తూంటారు. ఈ జలపాతానికి చేరుకోవాలంటే గుంజివాడ, గిన్నెలకొట, జడిగుడ గెడ్డలను అష్టకష్టాలు దాటి వెళ్ళాల్సిందే.

కొత్తపల్లిలో…కొత్త అనుభూతి

జీమాడుగుల, చింతపల్లి మండలాల సరిహద్దుల్లో ఉండే ఈ జలపాతం వర్షకాలమే కాకుండా ఇతర కాలాల్లో సైతం గలగల పారుతూ పర్యాటకుల మనసును దోచేస్తుంది. తెల్లని నురగలతో చల్లనీ నీటిలో స్నానాలు చేస్తుంటే ఆ నీటిలో సరిగమలు సవ్వడి చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఎత్తౖన కొండల మీద నుండి జాలువారే నీటిలో సెలయేటి క్రింద జలకాలాడుతుంటే అద్భుత లోకాలను విహరిస్తున్నట్లు అనిపిస్తుంది.

కటికలో ట్రెక్కింగ్ అదో అనుభూతి

అనంతగిరి మండలంలోని కటిక జలపాతం చూడటానికి సుందరంగా ఉంటుంది. బొర్రా గుహలకు సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండే అద్భుతమైన జలపాతం. కటిక జలపాతానికి చేరుకోవాలి అంటే ట్రెక్కింగ్‌ చేయాలి. ఇలా ట్రెక్కింగ్‌ చేయడం పర్యాటకులకు మధురానుభూతిని ఇస్తుంది. జలపాతానికి పేరు సమీపంలోని గ్రామం నుండి వచ్చింది. కటికి జలపాతం గోస్తని నది ద్వారా ఏర్పడింది. ఇది 100 అడుగుల ఎత్తు నుండి కిందకు జారుతోంది. జలపాతం దిగువన ఉన్న చెరువు ఈ ప్రదేశానికి కఠినమైన ట్రెక్కింగ్‌ తర్వాత స్నానం చేయడానికి అద్భుతమైన ప్రదేశం. దట్టమైన అడవి గుండా 20-30 నిమిషాల ట్రెక్‌ చేసి చేరుకోవాలి. ఇదే కాకుండా తాటిగూడ జలపాతం సైతం ఎంతో చూడముచ్చటగా ఉంటుంది.

పోల్లూరులో జల పరవళ్లు
చింతూరు మండలంలోని మోతుగూడెం పంచాయితీ పరిధిలోని పోల్లూరుకు దగ్గరలో గల అభయారణ్యంలో ప్రకృతి సిద్దంగా ఏర్పడిన జలపాతం ప్రకృతి రమణీయంగా ఉంటుంది. ఈ పోల్లూరు జలపాతం ఒరిస్సా గిరిజనులకు ఆరాధ్యదైవం వంటిది. ఈ జలపాతం వద్ద ప్రతి సంవత్సరం ఒరిస్సా గిరిజనులు జాతరను సైతం నిర్వహించుకుంటారు. ప్రకృతి రమణీయ సోయగాల నడుమ అడవి తల్లి ఒడిలో రాతి బండల మీద నుంచి జాలువారుతున్న ఈ జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఆంద్రా, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, ఒరిస్సా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో ఉన్న జలపాతం ప్రకృతి రమణీయులకు వరంగా మారింది. లక్కవరం అటవీక్షేత్రం పరిధిలోగల పోల్లూరు జల విద్యుత్‌ కేంద్రానికి 7 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇంతటి అందాలను సందర్శించేందుకు ఆంద్రా, తెలంగాణ, ఒరిస్సా, ఛ‌త్తీస్‌గఢ్‌ నాలుగు రాష్ట్రాల నుంచి సైతం నిత్యం పర్యాటకులు వస్తుంటారు.

రంపచోడవరం.. శివయ్య తాండవ స్థలం

రంపచోడవరం మండలంలోని రంప జలపాతం శివుని సన్నిధిలో ఉండటం విశేషం. ఇది 50 అడుగుల ఎత్తు నుంచి జాలువారే అందమైన జలపాతం. ఈ జలపాతం అందమైన, దట్టమైన అడవుల మధ్య ప్రకృతి ఒడిలో సేద తీరినట్టుగా అనిపిస్తుంది. ఈ రంప జలపాతాలు పర్యాటకులకు ఒక మంచి ట్రెక్కింగ్‌ అనుభూతిని కలిగిస్తాయి. ఈ జలపాతానికి సమీపంలో ఒక పురాతనమైన ఆలయం కూడా ఉంది. అదే నీలంకఠేశ్వర ఆలయం. కార్తీకమాసంలో రంప జలపాతానికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.

అడుగడుగునా… ఎన్నో అంద చందాలు

అల్లూరి జిల్లాలోని రంపచోడవరం నియోజవర్గ మన్యం జలపాతాల అందాలు చూడతరమా అన్న చందంగా ఉంటాయి. ఎత్తైన చెట్లు, దట్టమైన అడవులు, కొండల మధ్య ప్రవహించే సెలయేళ్లు ఇలా ప్రకృతి అందానికి నెలవుగా ఉంటుంది మన్యం. మన్యం అటవీ ప్రాంతాలు నిత్యం పర్యాటకుల రద్దీతో కన్నుల పండువ‌గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ జలపాతాలలో తడిసి ఆనందాలతో కేరింతలతో సందడి చేస్తూ ఉంటారు. మారేడుమిల్లి, అడ్డతీగల, రాజవోమ్మంగి, వైరామవరం ప్రాంతాల్లో జలపాతాలు, ప్రవహిస్తున్న వాగులు ప్రకృతి అందాలకు పెట్టింది పేరుగా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతాల్లోని జలపాతాల్లో సీతపల్లి వాడు, పాములేరు, పింజరి కొండ, జలతరంగణి, అమృతధార, వాలమూరు, దుంపవలస, చీకుదార, భరతనామ్‌ పల్లి, పూతిగుంట లాంటి జలపాతాలు, కొండ వాగులు పర్యాటకులకు మరిచిపోలేని అనుభూతిని కలిగిస్తాయి. ఈ ప్రాంత సోయగాలకు మంత్రముగ్దులవుతారు. సోకిలేరు జలపాతం పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ వేసవిలో ఎండల నుంచి సేద తీరాలంటే ఇలాంటి జలపాతాలకు తప్పక వెళ్లాల్సిందే. ఈ జలపాతాలతో పాటు అరకు, పాడేరు నియోజకవర్గ పరిధిలోని అరకువ్యాలీ మండలంలో చాపరాయి, జీకేవీధి మండలంలో దొని గుమ్మల, జీమాడుగుల మండలంలో గుర్రాయి, కోయ్యూరు మండలంలో వలసం పేట, చీకటిదార జలపాతాలు సైతం అత్యంత అద్వితీయంగా ఉంటాయనడంలో ఎటువంటి సందేహాం లేదు. మరెందుకు మరి మన్యంలోని జలపాతాలను ఒక్క పాలి చూసోస్తే పోలే !.

Advertisement

తాజా వార్తలు

Advertisement