Monday, November 18, 2024

Special Story ఫలరాజు నారాజ్‌! దిగుబ‌డి లేని మామిడి

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ప్ర‌తినిధి, కడప: ఉద్యాన పంటల్లో ఫలరాజంగా ప్రసిద్ధి చెందిన మామిడికి గడ్డు పరిస్థితులు దాపురించాయి. గతేడాది వర్షాభావ పరిస్థితులు, ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు కారణంగా పూత సకాలంలో రాలేదు. ఆలస్యంగా వచ్చిన పూత కూడా నిలవకుండా మాడిపోయింది. ఫలితంగా ఏపీలో మామిడి దిగుబడి ఏడాదికేడాదికి గణనీయంగా తగ్గుతోంది. మామిడిపండ్ల సాగు, దిగుబడిలో అగ్రస్థానంలో ఉన్న ఏపీ క్రమంగా తన స్థానాన్ని కోల్పోతోంది. రాష్ట్ర విభజన తర్వాత మామిడి పంటలో ఏపీని వెనక్కి నెట్టి ఉత్తరప్రదేశ్ ముందంజలో ఉందని అగ్రికల్చర్ అండ్ ప్రోసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ డెవలప్ మెంట్ అథారిటీ (ఎపెడా) గణాంకాలు చెబుతున్నాయి.

సాగు విస్తీర్ణం, దిగుబ‌డిలోనూ యూపీ టాప్‌

సాగు విస్తీర్ణం, దిగుబడి రెండింటిలోనూ యూపీదే మొదటి స్థానం. ఆంధ్ర ప్రదేశ్ రెండో స్థానంలో ఉంటే, కర్ణాటక, తెలంగాణ, బిహార్, గుజరాత్ వంటివి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఏటేటా మారుతున్న పరిస్థితులకు తోడుగా వాతావరణ అననుకూలత కారణంగా దిగుబడి తగ్గుతోంది. సాగు విస్తీర్ణం కూడా కుచించుకుపోతోంది. తెలంగాణలో వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ వంటి కొన్ని ప్రాంతాల్లోనే మామిడి పంట ఉంది. కానీ ఏపీలో మాత్రం శ్రీకాకుళం నుంచి కడప, చిత్తూరు వరకూ అన్ని జిల్లాల్లో మామిడి సాగవుతోంది.

- Advertisement -

లెక్కలను పరిశీలిస్తే..

ప్రపంచంలోనే మామిడిపళ్ల ఉత్పత్తిలో భారత్‌ది మొదటిస్థానం. కేంద్ర ప్రభుత్వ హార్టీకల్చర్ బోర్డు లెక్కల ప్రకారం 2023లో దేశంలో ఉత్పత్తయిన మామిడిలో ఉత్తరప్రదేశ్ 23.06 శాతం ఉత్పత్తి చేస్తోంది. ఏపీ నుంచి 16.07 శాతం ఉత్పత్తి అవుతోంది. తెలంగాణ నుంచి 8.54 శాతం మామిడి వస్తోంది. ఏపీ ప్రభుత్వ ఉద్యాన శాఖ లెక్కల ప్రకారం 2022-23లో రాష్ట్రంలో 4.03 లక్షల హెక్టార్లలో మామిడి పంట ఉంది. దాని నుంచి 59.06 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి దిగుబడి జరిగింది. రాష్ట్ర విభజన నాటితో పోలిస్తే ఏపీ ప్రభుత్వ అధికారిక లెక్కల్లో కూడా దిగుబడి తగ్గింది. అనేక చోట్ల రైతాంగం మామిడి తోటల స్థానంలో ఇతర పంటల వైపు మొగ్గుచూపుతున్నారు. మామిడి ఏటా వేసవి సీజన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మూడు నెలల పాటు పంట ఉంటుంది. సరిగ్గా ఆ సమయానికి వాతావరణం అనుకూలించకపోతే పంట నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఏప్రిల్, మే నెలల్లో వచ్చే ఈదురుగాలులు, వర్షాల భయం మామిడి రైతులను వెంటాడుతూ ఉంటుంది. దానికి ముందు మంచు ఎక్కువగా కురవడం, వర్షాలు సకాలంలో కురవకపోవడం వంటి అననుకూల పరిస్థితులు మామిడి రైతులను వేధిస్తూఉంటాయి.

బంగినపల్లి, బెనిషాకే డిమాండ్..

మామిడి పంట ఎక్కువగా ఎగుమతుల మీద ఆధారపడి సాగు చేస్తారు. ఎగుమతులకు డిమాండ్ ఉన్న పంటలకే ధర పలుకుతుంది. అందులో ఏపీలో పండించే ముఖ్యంగా బంగినపల్లి, బెనిషా, మల్గూబా, రెడ్ పసంద్, సువర్ణరేఖ, తోతాపురి, కోలంగోవ, పణుకులు వంటి రకాలకు మార్కెట్ ఉంటుంది. చిన్న రసాలు, పెద్ద రసాలు, నీలం వంటి రకాల్లో పెద్దగా ఎగుమతికి అవకాశం ఉండదని రైతులు చెబుతున్నారు. మామిడి చాలావరకు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తుంటారు. 2022-23 లెక్కల ప్రకారం భారత్ నుంచి 27,872.78 మెట్రిక్ టన్నుల మామిడి ఎగుమతి అయ్యింది. ప్రధానంగా యూఏఈ, యూకే, ఖతార్, ఒమన్ వంటి దేశాలకు సుమారుగా రూ 327.45 కోట్ల విలువైన మామిడి ఎగుమతి అయ్యింది. అదేవిధంగా దేశంలోని దిల్లీ, కలకత్తా, బరంపురం, భువనేశ్వర్, కటక్, పట్నా, బెనారస్, ఛత్తీస్ గఢ్, పంజాబ్ తదితర ప్రాంతాలకు కూడా వ్యాపారులు ఎగుమతి చేస్తుంటారు.

పూత పట్టక.. వచ్చినది నిలవక..

మామిడి దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. చెట్టుకు ఒక కాయ కూడా లేదంటే నమ్ముతారా?. ఈసారి సీజన్ రాకముందే రైతుల్లో కలవరం మొదలైంది. సాధారణంగా నవంబరు, డిసెంబరు నెలల్లో మామిడి చెట్లకు పూత వస్తుంది. జనవరిలో మొగ్గలతో పూత విరివిగా కనిపించాలి. ఈ ఏడాది ఫిబ్రవరిలో 50 శాతం చెట్లలోనే పూత కనిపించింది. రైతులు, వ్యాపారులు అవగాహన లోపంతో మామిడి చెట్ల పూత నిలపాలని మందులు పిచికారీ చేస్తుండడంతో అప్పుడే పూసిన పుప్పొడి రాలిపోయి నష్టం వాటిల్లుతోంది. అరకొరగా కాసిన మామిడి కాయలు కూడా, తేనె మంచి తెగుళ్లు తామర తెగుళ్లు, వైరస్ సోకడం వంటి ప్రకృతి ప్రతికూల పరిస్థితులన్ని కూడా మామిడి సాగు లో దిగుబడి గణనీయం తగ్గి పోయేందుకు కారణం అయ్యాయి. సగటున ఎకరాకు 5నుంచి 6 టన్నుల వరకూ దిగుబడి వస్తుంది. ఈ ఏడాది మధ్యస్తంగా కూడా ఉంటుందో లేదో అని ఆందోళన కనిపిస్తోంది. సేద్య పద్ధతుల మీద అవగాహన లేకపోవడం వల్ల సశ్యరక్షణ పేరుతో ఎక్కువగా రసాయనాలు వాడుతున్నారు. దానివల్ల మామిడి పూత, పిందె దశలో రాలిపోతున్నాయి. అలాంటి వాటి మీద అవగాహన పెంచుకోవడం, ఏటా మామిడి తోటలకు నీటి సదుపాయం కల్పించడం వంటి చర్యల ద్వారా దిగుబడులు పెంచుకునే అవకాశం ఉంది. మామిడి దిగుబడులు తగ్గుతున్న దృష్ట్యా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి రైతులకు అవగాహన పెంచే ప్రయత్నం చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement