Wednesday, November 6, 2024

Manyam Roads – ఈ దారి.. ‘నరకానికి ’ రహదారి

అడుగుకో గుంత‌.. గజానికో గొయ్యి
ఇదేం రోడ్డు బాబోయ్‌!
అధ్వానంగా అంతరాష్ట్ర ర‌హ‌దారి
ఈ దారిలో వాహ‌నాలు న‌డ‌ప‌లేం.. నడకే బెస్టు
ఆరేళ్లుగా మరమ్మత్తులకు నోచ‌ని రోడ్డు
ప్ర‌మాదాల‌తో గాల్లో క‌లుస్తున్న ప్రాణాలు
ప‌ట్టించుకోని అధికారులు

( ఆంధ్రప్రభ స్మార్ట్, చింతూరు ) అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యం అంటే… నాలుగు రాష్ట్రాల కూడలి. ఆంధ్రా, చత్తీస్‌గ‌డ్‌, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లోని గిరిపుత్రుల జీవన స్థితే కాదు.. వ్యాపారుల వాణిజ్యం, పర్యాటక రంగం అభివృద్ధికి కీలకం. ఈ జిల్లా నుంచే నాలుగు రాష్ట్రాల జనం రాకపోకలకు ఈ రహదారులే ఆధారం. కానీ ఈ ప్రధాన రహదారి స్థితిని ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. పోతే జనం ప్రాణాలే కదా? అనే తీరులో గత ఐదారేళ్లుగా కనీసం మరమ్మత్తులు చేపట్టడం లేదు. దీంతో చింతూరు – మోతుగూడెం రోడ్డులో ప్రయాణం నరకంగా మారింది. ఆంధ్రా, చత్తీస్‌గడ్‌, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాల నుంచి రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం తదితర మహా నగరాలకు, అల్లూరి జిల్లా కేంద్రం పాడేరుకు, ఇతర ప్రాంతాలకు వెళ్ళాలంటే ఈ దారి ఒక్కటే. ఈ రోడ్డు పొడవునా ఎక్కడబడితే అక్కడ పెద్ద పెద్ద గుంతలు, గోతులతో జనం నానా అవస్థలు పడుతున్నారు. ఈ రోడ్డులో ఇక నడకే బెస్ట్ అని జనం వాపోతున్నారు.

రహదారిలో నడి మధ్యలోనే..
చింతూరు – మోతుగూడెం ప్రధాన రహదారిలో చింతూరు మొదలుకొని మోతుగూడెం మార్గం అధ్వానంగా మారింది. ఈ రోడ్డు కాస్త ప్రమాదాలకు నిలయంగా మారింది. రోడ్డు మధ్య‌లో ఎక్కడ బడితే అక్కడ గోతులు ఉండటంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ గుంతల్లో పడి జనం ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు లెక్కలేన‌న్ని ఉన్నాయి. మన్యం రహదారిలో ప్రయాణం ఒక మధురాను భూతిని ఇస్తుంది అనేది ఒకప్పటి మాట. మరి ఇప్పుడు ఈ దారుల‌ను చూసిన‌వారెవ‌రూ ఆ మాట ఎవ‌రూ అన‌లేరు. వాహనాలు, కార్లు ఈ రహదారిలో వెళుతుంటే ఆ రోడ్‌లోని గుంతలు, గోతుల్లో పడి ఉయ్యాల జంపాల ఊగుతున్నట్లు అనిపిస్తుంది.

- Advertisement -

ఆదమరిస్తే అంతే …
ఈ చింతూరు – మోతుగూడెం ప్రధాన రహదారిలో ఆదమరిచి ప్రయాణం చేస్తే అంతే సంగతులన్నట్లు ఉంది. రహదారి పొడవునా ఉన్న గోతుల వ‌ద్ద‌ బైకులు, కార్లు అదుపు త‌ప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటుంటే.. మ‌రికొంద‌రు దివ్యాంగులుగా మిగులుతున్నారు. ఇక చిన్నపాటి వర్షం వస్తే చాలు ఆ గుంత‌లు కుంట‌ల‌ను త‌ల‌పిస్తాయి. ఈ రహదారి నాలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రయాణికులకు, పర్యాటకులకు, వాణిజ్య అవసరాలకు ప్రధానం కావడంతో వాహనాల రద్దీ సైతం అధికంగా ఉంటుంది.

ఆరేళ్ల నుంచి మరమ్మతుల్లేవ్‌..
ఈ రహదారికి ఐదారేళ్ల‌ నుంచి ఎటువంటి మర్మమతులు చేయకపోవడంతో ఈ దుస్థితి దాపురించిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వం దృష్టిసారించి రహదారిపై ఉన్న గోతులను, గుంతలను పూడ్చి మర్మమతులు చేప‌ట్టాల‌ని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement