టికెట్ రేట్లు పెంచిన ట్రావెల్స్ ఏజెన్సీలు
పండుగ పేరుతో అయిదొందల శాతం ధరల పెంపు
బస్సు మార్గంలో ప్రైవేటు ఆపరేటర్స్ గుత్తాధిపత్యం
విజయవాడకే ఏకంగా ₹2500 బాదుడు..
రాజమండ్రికి ₹4 వేలు.. విశాఖకు ₹6 వేలకు పైమాట..
విమానయానం ఇకమీదట గగన కుసుమం
విజయవాడకు ₹3 వేల లోపుంటే.. ప్రస్తుతం ₹12 వేలు
విశాఖకు ఏకంగా ₹15 నుంచి ₹18 వేలకు పెంపు
ప్రత్యేకం పేరుతో రేట్లు పెంచేసిన టీజీఎస్ఆర్టీసీ
ఇంతటి గందరగోళంలో ఊరటనిస్తున్న ఏపీఎస్ఆర్టీసీ
సాధారణ ధరలతోనే పండుగవేళ ప్రయాణాలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ: సంక్రాంతి సీజన్ అంటే.. అందరికీ పండుగే. జనాలను దోచుకోడానికి అనుకూలించే పర్ఫెక్ట్ సీజన్ ఇది. పండక్కి జనం ఇంటికెళ్లి కుటుంబాలతో పాటు ఎంజాయ్ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇందుకోసం ప్రజలు ఎలాగైనా గమ్యం చేరుకునే ప్రయత్నాలు చేస్తారు. బస్సుల్లోనో.. రైళ్లలోనో.. ఫ్లైట్స్ బుక్ చేసుకునో.. క్యాబ్‌లు మాట్లాడుకోనో.. వెళ్తుంటారు. ఇదే అదనుగా ప్రైవేట్ వాహనదారులు, ట్రావెల్ ఏజెన్సీలు పండుగ బాదుడుకి తెరతీశాయి. టికెట్ రేట్లు భారీగా పెంచేశాయి. సాధారంగా వెయ్యి రూపాయలు ఉండే టికెట్ ధర రెండింతలు పెరిగింది.
దంచిపడేస్తున్న ప్రైవేటు ట్రావెల్స్..
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాలంటే వెయ్యి లోపే ఖర్చయ్యే చోట 1500 నుంచి 2500 వరకు పెట్టాల్సి వస్తోంది. సంక్రాంతి పండగంతా గోదావరి జిల్లాల్లోనే కనిపిస్తుంది. అక్కడకు స్థానికులే కాదు.. తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి చాలమంది తరలివస్తుంటారు. దీంతో రాజమండ్రి టికెట్ హైదరాబాద్ నుంచి 1500ని మించదు కాని.. ఈసారి స్లీపర్ 4వేల రూపాయలుగా పెట్టేశారు. ఈ దోపిడీ ఏంటని ప్రయాణికులు తల పట్టుకుంటున్నారు. నాన్ ఏసీ అయితే 2వేలు ఉంది. వైజాగ్‌కు ఆర్టీసీ బస్సులో 2వేల రూపాయల లోపే టికెట్ ఉంటే.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు 3వేల నుంచి 5500 వరకు వసూలు చేస్తున్నాయి. స్లీపర్ అయితే 6 వేల రూపాయల దాకా చార్జ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
రైళ్ల ధరలు అందుబాటులో ఉన్నా..
రైళ్లలో వెళ్లడానికి చార్జీ ధరలు అందుబాటులోఉన్నా.. రద్దీ మామూలగా లేదు. రెండు మూడు రాష్ట్రాల్లో పండుగ ఉండడంతో రైళ్లు రద్దీగా ఉన్నాయి. అంతేకాదు లేటుగా నడుస్తుండడం కూడా ప్రయాణికులపై ఎఫెక్ట్ పడుతోంది. ఈ సంక్రాంతికి అదనంగా 162 ప్రత్యేక రైళ్లను వివిధ మార్గాలలో నడుపుతన్నా రిజర్వేషన్‌లో సీటు దొరకడం లేదు.
ఆకాశంలో విమానం ధరలు
గత్యంతరం లేని స్థితిలో చాలామంది ప్రయాణికులు ఫ్లైట్లను ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం, రాజమండ్రి, వైజాగ్‌కు వెళ్లేందుకు ఎగబడుతుండడంతో ఇదే అదనుగా పలు విమానయాన కంపెనీలు చార్జీలను పెంచేశాయి. రాజమండ్రి వెళ్లాలంటే 12 వేల నుంచి 15వేల వరకు టికెట్ ధర కనిపిస్తోంది. వైజాగ్ టికెట్ కొనాలంటే 15వేలకు తగ్గడంలేదు. దీంతో జనం పండుగ చేసుకునేందుకు దాచుకున్న సొమ్మంతా ట్రావెల్స్ కంపెనీలు నిలువు దోపిడీ చేస్తున్నాయి. ఇక.. క్యాబ్‌లో వెళదామన్నా పండుగ రష్‌తో 24 గంటల ప్రయాణానికి ₹30 వేలు చెల్లించాల్సిందే అంటున్నారు.
టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బాదుడు..
పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని సుమారు ఆరు వేల అదనపు బస్సు సర్వీసులను నడుపుతున్నట్టు తెలంగాణ ఆర్టీసీ తెలిపింది. అయితే.. ఈ పండుగ సీజన్‌ను పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకునేందుకు ఆర్టీసీ రెడీ అయినట్టు తెలుస్తోంది. శుక్రవారం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సు టికెట్ ధరలను అమాతంగా ఒకటిన్నర శాతం పెంచేసింది. దీంతో ఇంటికెళ్లే దారేది అన్నట్లు జనం తల పట్టుకుంటున్నారు.
ఊరటనిస్తున్న ఏపీఎస్ ఆర్టీసీ..
పండుగ సీజన్లో ఏపీఎస్ ఆర్జీసీ వివిధ మార్గాల్లో ఏడు వేల బస్సు సర్వీసులను రంగంలోకి దించింది.. ప్రతి బస్సుకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. సాధారణ ధరలతోనే బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. అంతేకాకుండా ఒకేసారి రెండు వైపుల రిజర్వేషన్ చేసుకుంటే పది శాతం రాయితీ కూడా కల్పిస్తున్నట్టు అధికారులు తెలిపారు. దీంతో ఆ బస్సుల్లో జర్నీ చేసేందుకు జనం పరుగులు తీస్తున్నారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా అవసరమైతే మరిన్ని బస్సు సర్వీసులను అందుబాటులోకి తెస్తామని ఆ సంస్థ ఎండీ తెలిపారు.