Saturday, October 5, 2024

Special – ద‌ర్జాగా.. విద్యుత్ చౌర్యం

ఆంధ్రప్రభ స్మార్ట్, చింతూరు/ఎటపాక : విజ జీuయవాడ నుంచి – జగదల్‌పూర్‌ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా 30 పనులను చేపట్టిన కాంట్రాక్టర్.. చింతూరు, ఎటపాక మండలాల్లో అక్రమంగా విద్యుత్‌ను వినియోగిస్తున్నా ఆ శాఖ అధికారులు నిద్ర మ‌త్తు వీడ‌టం లేదు.

. వివరాల్లోకి వెళితే భద్రాచలం నుంచి చింతూరు మండలంలోని చిడుమూరు గ్రామం వరకు జాతీయ రహదారి విస్తరణ పనులు కొన‌సాగుతున్నాయి. ఈ పనులకు ఎక్కడ విద్యుత్‌ అవసరమైతే అక్కడే ఎల్‌టీ (లో టెన్సన్‌ వైర్‌) లైన్‌ నుంచి అక్రమంగా విద్యుత్‌ను వినియోగిస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా విద్యుత్‌ చోరికి పాల్పడుతుంటే.. ఆ శాఖ అధికారులు ఏం చేస్తున్నారనే పలువురు ప్రశ్నిస్తున్నారు. మేము అనుమతి ఇవ్వలేదని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నా… కరెంటు అక్రమ వినియోగంపై ఎందుకు చర్య తీసుకోలేదని ప్రజలు ప్రశ్నలు సంధిస్తున్నారు.

ఈ రహదారి విస్తరణ పనుల్లో ఎటపాక మండలంలోని లక్ష్మీపురం గ్రామ శివారు ప్రాంతంలో చిన్న బ్రిడ్జ్‌ నిర్మాణ పనుల జరుగుతున్నాయి. ఇందుకోసం ఎల్‌టీ విద్యుత్‌ లైన్‌ మధ్య నుంచి సర్వీస్‌ వైర్‌తో విద్యుత్‌ను అపహరిస్తున్నారు.

సర్కారు బడినీ వదల్లే..

ఈ కాంట్రాక్టర్ ఎల్‌టీ లైన్‌ నుంచి విద్యుత్‌ చౌర్యానికి పాల్పడటమే కాకుండా ప్రభుత్వ పాఠశాలల నుంచి సైతం కరెంటును కూలీల క్యాంపులకు వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే చింతూరు మండలంలోని సరివెల గ్రామంలోని మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాల నుంచి దొంగతనంగా స్విచ్‌ బోర్డు నుంచి సర్వీస్‌ వైర్‌ ద్వారా విద్యుత్‌ను క్యాంపునకి వినియోగిస్తున్నారు.

ఈ విధంగా దొంగతనంగా విద్యుత్‌ వినియోగిస్తున్నప్పటికీ ఇటు విద్యుత్‌ శాఖ అధికారులు కానీ.. అటు విద్య శాఖాధికారులు కానీ పట్టించుకోవడం లేదనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే విద్యుత్‌ శాఖ ఉన్నత అధికారులు విద్యుత్‌ దొంగతనంపై చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

విద్యుత్‌ కనెక్షన్‌ తొలగిస్తాం : పరుశురాం నాయుడు, విద్యుత్‌ శాఖ ఏఈ, ఎటపాకజాతీయ రహదారి 30 విస్తరణ పనులకు అనుమతులు లేకుండా దొంగతనంగా విద్యుత్‌ వినియోగిస్తున్న విషయంపై ఎటపాక ఏఈ పరుశురాం నాయుడుని వివరణ కోరగా… ఈ విషయం నా దృష్టికి ఇంతవరకు రాలేదు. గురువారం దొంగ విద్యుత్‌ కనెక్షన్‌ను తొలిగిస్తామని తెలిపారు. అక్రమంగా విద్యుత్‌ వినియోగించడం నేరమని ఆయన తెలిపారు.

పాఠశాల నుండి విద్యుత్‌ తీసుకోకూడదు : జీ.వెంకటేశ్వర్లు, ఎంఈవో-2,

చింతూరుప్రభుత్వ పాఠశాల నుంచి విద్యుత్‌ తీసుకోకూడదు. తక్షణమే విద్యుత్‌ కనెక్షన్‌ తొలగించాలని సంబంధిత ప్రధానోపాధ్యాయులకు చెబుతాను. ప్రభుత్వ పాఠశాల నుంచి దొంగతనంగా విద్యుత్‌ వినియోగించడం నేరం. ఈ విషయంపై చర్యలు తీసుకుంటాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement