(ప్రభ న్యూస్, ఎన్టీఆర్ బ్యూరో) : విజయవాడ కనకదుర్గ దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలకు దేవాలయ శాఖ అదనపు కమిషనర్ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ను స్పెషల్ ఆఫీసర్ గా నియమించారు. ఈ మేరకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సోమవారం అదేశాలు ఇచ్చారు.
శరన్నవరాత్రి ఉత్సవాల్లో కీలకమైన చివరి నాలుగు రోజుల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా చూసేందుకు, అన్ని విభాగాలను సమన్వయపరచుకునేందుకు ఆయనని నియమించారు. ఉత్సవాలను రాష్ట్ర పండుగ గా ప్రకటించిన నేపథ్యంలో, ఈ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం పై ఉందని మంత్రి పేర్కొన్నారు.
ముఖ్యంగా కనకదుర్గ అమ్మవారికి ప్రీతిపాత్రమైన మూలా నక్షత్రం రోజైన అక్టోబర్ 9వ తేదీ న తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చే భక్తులకు అమ్మవారి దర్శనం సులభంగా కలిగించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
రాష్ట్ర పండుగగా గుర్తించిన దసరా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం పై ఉందని, సీనియర్ అధికారులు ఉత్సవాల నిర్వహణలో భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసి, భక్తులకు అమ్మవారి దర్శనం నభూతో న భవిష్యత్ అనిపించేట్లుగా పనిచేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశించారు.