Thursday, November 7, 2024

AP | ప్ర‌త్యేక వైద్య, శిబిరాలు.. సురక్షిత ప్రాంతాలకు గర్భిణులు..

భారీ వర్షాలు, వరదల కారణంగా విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్ర‌స్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి తగిన సౌకర్యాలు కల్పించిందని వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు.

వరదల్లో చిక్కుకున్న గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో… మరో 10 రోజుల్లో ప్రసవం కానున్న 154 మంది గర్భిణులను వైద్య, ఆరోగ్యశాఖ సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు కృష్ణబాబు వెల్లడించారు. పునరావాస కేంద్రాలతో పాటు 14 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యసేవలు అందించామని, వీటితో పాటు 20 సంచార వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ వైద్య శిబిరాల ద్వారా ఇప్పటి వరకు 17,538 మంది రోగులు సేవలు పొందారని వివరించారు.

అత్యవసర వైద్య సేవల కోసం అదనంగా 25 అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచామన్నారు. వరదల కారణంగా రోగాలు పెరిగిపోవడంతో ప్రభుత్వాసుపత్రుల్లో సేవల కోసం వచ్చే రోగుల సౌకర్యార్థం అదనంగా 100 పడకలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

వివిధ కాలనీల్లో నీటిమట్టం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున విస్తృతంగా వైద్యసహాయక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా 32 వార్డుల్లో 64 వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని, ఈ వైద్య శిబిరాల్లో రోగులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేస్తామని వైద్యఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement