అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ హాస్టళ్లలో వచ్చిన పదవ తరగతి ఫలితాల పట్ల మంత్రి నాగార్జున అసంతృప్తిని వ్యక్తం చేసారు. పదవ తరగతి పరీక్షలలో అతి తక్కువ శాతం ఫలితాలు వచ్చిన చోట ప్రిన్సిపాల్స్ పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు గురుకుల ప్రిన్సిపాల్స్ పై చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఎస్సీ హాస్టళ్లలో రాష్ట్రస్థాయిలో 49 శాతం ఫలితాలు వచ్చినా కొన్ని జిల్లాల్లో ఫలితాల శాతం మరీ తక్కువగా ఉండటం పట్ల అసహనం వ్యక్తం చేసారు. అతి తక్కువ ఫలితాలు వచ్చిన చోట ప్రిన్సిపాల్స్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్సీ హాస్టళ్లలో ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలలో 49 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులైన నేపథ్యంలో సాంఘిక సంక్షేమశాఖ ఉన్నతాధికారులతో శుక్రవారం తన ఛాంబర్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నాగార్జున ఎస్సీ హాస్టళ్లలో చదివే 9వ తరగతి విద్యార్థులకు రెండు నెలల ముందు నుంచే 10వ తరగతికి సంబంధించిన పాఠ్యాంశాలపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులు అందర్నీ మళ్లీ హాస్టళ్లకు పిలిచి వారిని అక్కడే పెట్టుకొని, సప్లిమెంటరీ పరీక్షలలో ఉత్తీర్ణులు కావడానికి అవసరమైన స్పెషల్ ట్యూషన్లు పెట్టించాలని, ప్రతి విద్యార్థి కూడా సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేలా చూసుకోవాలని కోరారు. తొమ్మిదో తరగతికి చెందిన విద్యార్థులు పదవ తరగతికి వచ్చిన తర్వాత ఇబ్బంది పడకుండా రెండు నెలల ముందుగానే వారికి పదో తరగతికి చెందిన పాఠ్యాంశాలపై అవగాహన కల్గించే కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వచ్చే ఏడాది పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని మంత్రి సూచించారు ఫలితాలు మెరుగుపడకపోతే మాత్రం తాను సహించేది లేదని ఆయన హెచ్చరించారు.
గురుకులాల్లో ఉపాధి కోర్సులు..
స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ తో కలిసి ఎస్సీ విద్యార్థులకు ఉపాధి కల్పించే కోర్సులను రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి నాగార్జున అధికారులను ఆదేశించారు. నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, హెవీ డ్రైవర్ లాంటి కోర్సులతో పాటుగా కొత్త కోర్సులను కూడా ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.