Friday, November 15, 2024

AP | ‘ఆరోగ్య శ్రీ’పై ప్రత్యేక దృష్టి.. డిసెంబర్‌ 1 నుంచి కొత్త కార్డులు

అమరావతి, ఆంధ్రప్రభ: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులు 950 ఉంటే ఇప్పుడు 2,295 నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు అందుతున్నాయి. ఏపీలోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లోని పేరెన్నిక గల ఆసుపత్రులను కూడా ఆరోగ్యశ్రీలో ఎంప్యానెల్‌ చేశారు. అయినా వైద్యంకోసం ప్రజలు తమ జేబుల్లోంచి డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ సేవలందుకున్న రోగులకు ఏడాదిపాటు ఉచితంగా మందులు అందిస్తారు.

పేషెంట్లకు తెలియక, సరైన అవగాహన లేకపోవడం వల్ల చికిత్సలు చేయించుకున్న రోగులు తిరిగి ఆస్పత్రులకు వెళ్లి పూర్తిస్థాయిలో మందులు తీసుకోవడం లేదు. మూడు నెలల తర్వాత కేవలం 33 శాతం, సెకండ్‌ రిఫరల్‌ సర్వీసు అంటే ఆరు నెలల తర్వాత 22 శాతం, ఏడాది తర్వాత 8 శాతం మంది మాత్రమే మందులు తీసుకుంటున్నారు. అంటే ఆరోగ్య శ్రీ పథకంపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన లేదన్న విషయం ప్రభుత్వానికి స్పష్టంగా అర్థమైంది. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చాలని సీఎం వైఎస్‌ జగన్‌ సంకల్పించారు.

ప్రతి ఫోన్లో ఆరోగ్య శ్రీ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసేలా స్పెషల్‌ డ్రైవ్‌..

- Advertisement -

ఆరోగ్యశ్రీని ఎలా వినియోగించుకోవాలో తెలియని వ్యక్తి రాష్ట్రంలో ఉండకూడదని నిర్ణయానికి వచ్చిన సీఎం జగన్‌ ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలన్నదానిపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల్ని ఆదేశించారు.

ప్రతి ఒక్కరి ఫోన్లో, ప్రతి ఇంట్లో ఆరోగ్యశ్రీ యాప్‌ ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తోంది. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఆరోగ్యశ్రీ చికిత్స కోసం ఎక్కడకు వెళ్లాలన్నదానిపై పూర్తి వివరాలు ఈ యాప్‌లో ఉంటాయి. యాప్‌లోకి వెళ్తే సమీపంలోని ఎంపానెల్‌ ఆస్పత్రికి మార్గం చూపిస్తుంది. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేకుంటే విలేజ్‌ క్లినిక్‌, 104 సిబ్బంది ని అడిగినా తగిన రీతిలో గైడ్‌ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆరోగ్య శ్రీ సేవలను ఎలా పొందాలన్నదానిపై బుక్‌లెట్‌ ప్రతి కుటుంబానికి అందించనున్నారు. సీహెచ్‌ఓ, ఏఎన్‌ఎలు, ఆశావర్కర్లు ఆరోగ్యశ్రీని వినియోగించుకోవడం పై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ప్రణాళిక రూపొందించారు. నిర్ణీత సమయానికి పేషెంట్లు- వెళ్లి.. మందులు తీసుకునేలా మొబైల్‌ యాప్‌లో తగిన విధంగా ఫీచర్లు రూపొందించారు. పేషెంట్లు నిర్ణీత కాలానికి ఆస్పత్రులకు వెళ్లేలా చూడాల్సిన బాధ్యత విలేజ్‌ క్లినిక్స్‌కు, ఫ్యామిలీ డాక్టర్‌కు అప్పగించారు.

వైద్యంపై ఆరా

ఆరోగ్య శ్రీ కింద చికిత్సలు చేయించుకున్న పేషెంట్లపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. చికిత్స అనంతరం వారికి అందిన వైద్యంపై పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఎలాంటి లంచాలకు తావులేకుండా ఉచితంగా వైద్యం అందిందా? లేదా? అన్న దానిపై కూడా ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఆరోగ్య ఆసరా అందినట్లు నిర్ధారణ అయ్యాఆక వారి ఫొటోను పెట్టేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆరోగ్య శ్రీ పథకం కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.8.8 వేల కోట్లను ఖర్చు చేసింది. పేద మధ్య తరగతి కుటుంబాల్లో ఎవరైనా అనారోగ్యానికి గురై ఆపరేషన్‌ చేయించుకుంటే విశ్రాంతి సమయంలో కుటుంబ జీవనానికి ఇబ్బంది లేకుండా ఆరోగ్య ఆసరా పథకాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.971 కోట్లను వెచ్చిచింది.

దీని ద్వారా 15.65 లక్షల మంది రోగులు లబ్ధి పొందారు. ప్రతి మొబైల్‌లో ఆరోగ్య శ్రీ యాప్‌ డౌన్‌లోడ్‌ చేయడం పై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 40 లక్షల పై చిలుకు ఫోన్లలో ఆరోగ్య శ్రీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసినట్లు సమాచారం. మంచి ఫీచర్లతో ఆరోగ్య శ్రీ కార్డులు రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. డిసెంబర్‌ 1 తేదీ నుంచి ఆరోగ్య శ్రీ కార్డులు అందజేయనున్నారు.

విస్తృత అవగాహనపై దృష్టి

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు ఆరోగ్యశ్రీ సేవలు నామమాత్రంగా ఉండేవి. గతంలో 1050 ప్రొసీజర్లు మాత్రమే ఉంటే, ఇప్పుడు 3,255 ప్రొసీజర్లకు విస్తరించాయి. అన్ని రకాల క్యాన్సర్‌ దగ్గర నుంచి మొదలు కాక్లియర్‌ ఇంప్లాంట్‌దాకా ఆరోగ్యశ్రీలో కవర్‌ అవుతున్నాయి. వైద్యం ఖర్చు రూ.1000 దాటితే అది ఆరోగ్యశ్రీ పరిధిలోకి రావాలి, తేవాలన్న తపన, తాపత్రయంతో ఆరోగ్యశ్రీ పరిధిని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి విస్తరిస్తున్నారు.

గతంలో ఆరోగ్యశ్రీ బడ్జెట్‌ రూ.1100 కోట్లు కూడా లేని పరిస్థితి ఉంటే, ఈరోజు రూ.3,600 కోట్లకు అందుతోంది. ఆరోగ్య శ్రీ సేవలపై ప్రజల్లో పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడం వల్ల ఆపద సమయాల్లో ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదంలో ఉన్నప్పుడు నెట్‌వర్క్‌ ఆసుపత్రులు ఏవి, ఎక్కడుంటాయి ఎలా వెళ్ళాలి తెలియక అందుబాటులో ఉన్న ఆసుపత్రులకు వెళ్ళి కొందరు డబ్బు చెల్లించి వైద్య సేవలు పొందుతున్నారు. ఈక్రమంలో ఆరోగ్యశ్రీపై విస్తృత ప్రచారం ద్వారానే ప్రజల్లో పూర్తిస్థాయిలో అవగాహన కల్గించవచ్చన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది.

యాప్‌ ఉపయోగాలు ఇవీ

ఆరోగ్య శ్రీ యాప్‌ లోనే రోగికి సంబంధించిన రిపోర్టులు ఉండటం వల్ల అటు- రోగికి, వైద్యుడికి పని సులువు అవుతుంది. గతంలో వైద్య పరీక్షల పత్రాలను రోగులు పోగొట్టుకునేవారు. డిజిటల్‌ విధానంతో ఆ ఇబ్బంది ఉండదు. వైద్య పరీక్షల రిపోర్టులు రోగి వద్ద ఉంటే అతను నచ్చిన ఆసుపత్రిలో చూపించుకోవచ్చు. వైద్యులు కూడా రోగి గతంలో పొందిన చికిత్సల గురించి ఈ యాప్‌ ద్వారా తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది.

  • ఫోన్లో ఆరోగ్యశ్రీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లైతే అపద సమయంలో దాన్ని ప్రెస్‌ చేస్తే ఆసుపత్రుల పేర్లు, కాంట్రాక్ట్‌ నెంబర్ల ఐకాన్లు, ఆరోగ్య మిత్ర వివరాలు డిస్‌ప్లే అవుతాయి. వాటిని నొక్కగానే నేరుగా ఆ ఆసుపత్రి నుంచి బాధితుడికి ఫోన్‌ వస్తోంది.
  • ప్రమాద వివరాలు తెలుసుకొని ఆసుపత్రిలో చేర్పించి తగిన వైద్యం అందేలా సహాయపడతారు.
  • ఆసుపత్రికి వెళ్ళే మార్గాన్ని గుగూల్‌ మ్యాప్‌ద్వారా చూపిస్తోంది.
  • యాప్‌లో ఆరోగ్యశ్రీ కింద పొందిన చికిత్సలకు సంబంధించిన వివరాలు ఉంటాయి.
  • చికిత్స అనంతరం ఆరోగ్య ఆసరా ఏ కేసుకు ఎంత ఇస్తారనే వివారు తెలుసుకొనే అవకాశం ఉంది.
  • చికిత్స సమయంలో చేసిన వైద్య పరీక్షల రిపోర్టుల్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
Advertisement

తాజా వార్తలు

Advertisement