న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: శనివారం నుంచి ప్రారంభమైన గంగా పుష్కరాలకు హాజరయ్యే తెలుగు యాత్రికులను దృష్టిలో పెట్టుకుని ఉత్తర్‌ప్రదేశ్‌లో కాశీలో అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు గౌరవాధ్యక్షులుగా ‘శ్రీ కాశీ తెలుగు సమితి’ ప్రత్యేక చొరవ తీసుకుని జిల్లా యంత్రాంగంతో పలుమార్లు సమావేశమై ఎలాంటి ఏర్పాట్లు అవసరమో వివరించారు. భద్రతాపరంగా పోలీసు యంత్రాంగం చేయాల్సిన ఏర్పాట్ల గురించి కూడా వివరించారు.
అలాగే గంగా పుష్కరాల కోసం పెద్ద ఎత్తున తరలివచ్చే ఏపీ, తెలంగాణ యాత్రికులకు తగినన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తూ విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, సికింద్రాబాద్ నగరాల నుంచి కాశీకి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడంలోనూ జీవీఎల్ చొరవ తీసుకున్నారు. గంగా పుష్కరాల సమయంలో ఈ నెల 29న కాశీలోని మానస సరోవర్ ఘాట్ వద్ద ‘కాశీ – తెలుగు సంగమం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపీ, భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించగా, ఆయన హాజరై తెలుగు యాత్రికులను ఉద్దేశించి ప్రసంగిస్తానని హామీ ఇచ్చారు. ప్రధాని సందేశంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, వేద పఠనం, గంగా హారతి వంటి కార్యక్రమాలను కూడా రూపొందించినట్టు ఎంపీ జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు.
తెలుగులో జాగ్రత్తలు చెబుతున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది
సాధారణ రోజుల్లోనే కాశీని దర్శించే యాత్రికుల్లో అత్యధిక భాగం తెలుగు రాష్ట్రాలకు చెందినవారుంటారు. అలాంటిది గంగా పుష్కరాలు ప్రారంభమవడంతో తెలుగు యాత్రికుల తాకిడి మరింత పెరుగుతుందన్న ఉద్దేశంతో అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పుష్కర స్నానాల కోసం గంగా నదిలో దిగే యాత్రికులు ప్రవాహంలో పడి కొట్టుకుపోకుండా అన్ని ఘాట్ల వద్ద చైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. అలాగే ప్రత్యేక బోట్లు, లైఫ్ బోట్లతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించారు. వచ్చే యాత్రికుల్లో అత్యధిక భాగం తెలుగువారే ఉండడంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిలో కూడా తెలుగు సిబ్బంది ఎక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. యాత్రికులకు తెలుగులోనే మైక్ ద్వారా సిబ్బంది జాగ్రత్తలు చెబుతున్నారు. ఈ మొత్తం ఏర్పాట్లను ఎన్డీఆర్ఎఫ్‌లో తెలుగు అధికారి కమాండెంట్ ప్రసన్న కుమార్ పర్యవేక్షిస్తున్నారు.