( ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో ) : భవానీ దీక్షలు విరమణ సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే భవానీల కోసం పగటిబందిగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు పేర్కొన్నారు. భవాని దీక్షల విరమణ సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆలయ, పోలీస్ అధికారులతో నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు సమీక్ష సమావేశాన్ని సోమవారం నిర్వహించారు.
ఈ సమీక్షా సమావేశంలో భవాని దీక్ష విరమణలకు చేయాల్సిని ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి, క్యూలైన్లలో రద్ది, స్నానఘాట్ల వద్ద రద్దీ, ప్రసాదం కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించి భక్తులకు త్వరితగతిన అమ్మవారి దర్శనం అయ్యేవిధంగా గిరి ప్రదక్షణ సమయంలో భవాని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగుకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో కూలంకషంగా చర్చించారు.
ప్రత్యేకంగా భవాని దీక్ష విరమణ చేయడానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం, సమాచార నిమిత్తం ఒక ప్రత్యేకమైన యాప్ ను రూపొందించాలని చర్చించారు. విరమణ నిమిత్తం వచ్చు భక్తులకు ఒక యాప్ లోనే పూర్తి సమాచారం అందే విధంగా ఉండేలా యాప్ ను రూపొందించాలని దేవస్థాన ఐటీ అధికారులకు సూచనలు చేసినారు.
దీని ద్వారా దీక్ష విరమణకు వచ్చిన భక్తులు సులభంగా సమాచారం తెలుసుకుని త్వరితగతిన వారి వారి గమ్యస్థానాలకు చేరుకోవడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా గిరి ప్రదక్షణ సమయంలో ట్రాఫిక్ నిర్వహణ, బందోబస్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు డి.సి.పి.లు గౌతమి షాలి, తిరుమలేశ్వర రెడ్డి, ఎ.డి.సి.పి జి.రామకృష్ణ , ఏ.సి.పి. శ్రీ దుర్గారావు, ఇనస్పెక్టర్ గురు ప్రకాష్, దేవస్థాన ఈ ఈ వైకుంఠ రావు , ఎస్.ఐలు, దేవస్థాన ఐ. టి ఇంజనీరింగ్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.