Saturday, November 23, 2024

AP | 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు.. బందోబస్తుపై స్పీక‌ర్ కీల‌క ఆదేశాలు

ఈనెల 22వ తేదీ నుండి జరగనున్నఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ సమావేశాలు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి ఛైర్మ‌న్‌ కె.మోషేన్ రాజు, శాసన సభాపతి సిహెచ్ అయ్యన్నపాత్రుడు పోలీస్ శాఖ అధికారులను ఆదేశించారు.

ఈసారి అసెంబ్లీ సమావేశాలకు కొత్తగా ఎన్నికైన 88 మంది శాసనసభ్యులు, కొందరు శాసనమండలి సభ్యులు హాజరు కానున్నందున ఆయా సభ్యులను పక్కాగా గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అసెంబ్లీ ప్రాంగణం అత్యంత కీలకమైన భద్రతా జోన్ కావడంతో అన్ని సిసి కెమోరాలు సక్రమంగా పనిచేసేలా చూసుకోవాలని… లోపలికి ఎవరు బడితే వారు ప్రవేశించకుండా, శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బందోబస్తు, ఇతర ఏర్పాట్ల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి పోలీసు అధికారులు, సిబ్బందిని నియమించడం జరుగుతుందని వారికి తాగునీరు, ఆహారం వంటి కనీస సౌకర్యాలు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. రానున్న అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement