Saturday, November 23, 2024

బీసీల‌కు స‌మున్న‌త‌స్థానం క‌ల్పించిన సీఎం జ‌గ‌న్.. కొనియాడిన స్పీక‌ర్ త్మ‌మినేని

విజ‌య‌వాడ‌లో జ‌రుగుతున్న జ‌య‌హో బీసీ స‌భ‌లో స్పీక‌ర్ త‌మ్మినేని సీతారం పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. బీసీలకు సమున్నత స్థానం కల్పించి, సమాజంలో తలెత్తుకు జీవించేలా చేసిన ముఖ్యమంత్రి జగన్ కు సభకు హాజరైన అందరి తరపునా కృతజ్ఞతలు తెలియజేశారు. బీసీలను కించపరిచారంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తమ్మినేని మండిపడ్డారు. చరిత్ర తెలియనివాళ్లు బీసీల తోకలు కత్తిరిస్తామంటూ అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని సభా వేదికపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బీసీలు జడ్జిలుగా పనికిరారా.. మేం పనికిరామని లేఖలు రాస్తారా.. మాకు తెలివితేటలు లేవా అని చంద్రబాబును స్పీకర్ తమ్మినేని ప్రశ్నించారు. దేనికీ కార్పొరేషన్లు, దేనికీ డైరెక్టర్ పదవులు.. ఎందుకు ఇవి నాలుక గీసుకోవడానికా అంటూ హేళన చేస్తున్నారని స్పీకర్ మండిపడ్డారు. ఈ ఆర్డర్లు పేపర్లే కదా అని పొరపాటున నాలుక గీసుకునేవు అచ్చన్నా.. నీ నాలుక పీలికలవుతుందని హెచ్చరించారు. వచ్చే ఎన్నికలలో ఇదే బీసీలు చరిత్ర గతి తిరగరాస్తారని జోస్యం చెప్పారు. ముసుగు వేసుకొని బీసీ ద్రోహులు మారువేషంలో వస్తున్నారు జాగ్రత్తగా ఉండాలని బీసీలను స్పీకర్ తమ్మినేని అప్రమత్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని తమ్మినేని పిలుపు ఇచ్చారు. బీసీలకు దామాషా పద్ధతిలో రాజ్యాధికారం ప్రసాదించిన మహనీయుడు జగన్ రెడ్డి అని స్పీకర్ చెప్పారు. కార్పొరేషన్ల నుంచి మంత్రిమండలి దాకా.. ఇలా అన్నింట్లోనూ బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పించారని జగన్ ను స్పీకర్ తమ్మినేని కొనియాడారు. వెనకబడిన కులాలే వెన్నెముక నినాదంతో అధికార వైసీపీ చేపట్టిన జయహో బీసీ మహా సభ విజయవాడలో ప్రారంభమైంది. ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి బీసీలు తరలి వచ్చారు. బీసీ నేతలంతా కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు.

ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ప్రారంభోపన్యాసం చేస్తూ.. ముఖ్యమంత్రి జగన్ బీసీల స్థితిగతులను మార్చారని కొనియాడారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారని చెప్పారు. జగన్ బడుగు బలహీన వర్గాల పక్షపాతి అని ప్రశంసలు కురిపించారు. ఆంధ్రప్రదేశ్ లో బీసీలను అభివృద్ధి చేసిన దమ్మున్న నాయకుడు మఖ్యమంత్రి జగన్ అని వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య కొనియాడారు. బీసీలకు ఆత్మగౌరవం కాపాడడంతోపాటు అన్ని రంగాల్లో అభివృద్ధి మార్గంలో నడిపించిన ముఖ్యమంత్రి అని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలు చెప్పే మాయమాటలకు బోల్తాపడకూడదని సూచించారు. బీసీల అభివృద్ధికి పాటుపడుతున్న జగన్ కు అండగా నిలవాలని బీసీ శ్రేణులకు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. తన రాజకీయ జీవితంలో బీసీల కోసం ఇంతగా పాటుపడిన, ధైర్యంగా నిలుచున్న ముఖ్యమంత్రిని చూడలేదని ఆర్.కృష్ణయ్య అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement