Friday, January 24, 2025

SP Subbarayadu తొలి పంజా! రూ.4.5 కోట్ల విలువ చేసే ఎర్రచందనం స్వాధీనం

తిరుప‌తి, ఆంధ్ర‌ప్ర‌భ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఇటీవ‌ల కాలంలో ఎస్పీ సుబ్బారాయుడు పేరు ప్ర‌తి ఒక్క‌రికీ సుప‌రిచిత‌మే. ప్ర‌తిరోజూ వార్త‌ల్లో న‌లుగుతూనే ఉన్నారాయ‌న‌. తెలంగాణ కేడర్ కు చెందిన సీనియర్ పోలీస్ అధికారిగా ఉన్న సుబ్బారాయుడు ప్రస్తుతం ఏపీలో పనిచేస్తున్నారు. సుబ్బారాయుడు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితులంటూ స్వయంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తావించారు. వైసీపీ నేతలను ఇబ్బంది పెట్టేందుకే ఆయనను తెలంగాణ నుంచి ఏపీకి తీసుకువచ్చారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే… సుబ్బారాయుడును సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకుని వస్తామంటూ జగన్ పవర్ పంచ్ డైలాగ్ సంధించారు.

తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో బ‌దిలీ వేటు…
తిరుపతిలో ఇటీవ‌ల‌ చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన సమయంలోనూ సుబ్బారాయుడు ప్రస్తావన బాగానే వినిపించింది. తొక్కిసలాట సమయంలో తిరుపతి జిల్లా ఎస్పీగా ఉన్న సుబ్బారాయుడును ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ డీఎస్పీని సస్పెండ్ చేసిన చంద్రబాబు సర్కారు. తనకు ఇష్టమైన సుబ్బారాయుడిని మాత్రం బదిలీతో సరిపెట్టిందని వైసీపీ విమర్శలు సంధించింది. అయితే ఈ విమర్శలను అంతగా పట్టించుకోని చంద్రబాబు… సుబ్బారాయుడుకు తిరుపతిలోనే పోస్టింగ్ ఇచ్చారు. తిరుపతి కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎర్రచందనం నిరోధక టాస్క్ ఫోర్స్ ఎస్పీగా సుబ్బారాయుడు నియమితులయ్యారు.

ఇదీ ఎస్పీ సుబ్బ‌రాయుడు పంజా!
ఈ పోస్టు దాదాపుగా రాష్ట్ర స్థాయి పోస్టు కిందే లెక్క. ఎర్రచందనం అక్రమ తరలింపుపై ఎక్కడైనా ఈ టాస్క్ ఫోర్స్ దాడులు చేయవచ్చు. ఎర్రచందనాన్ని పట్టుకోవచ్చు. స్మగ్లర్లను అరెస్ట్ చేయవచ్చు. ఈ పోస్టులో అలా చేరారో, లేదో సుబ్బారాయుడు పంజా విసిరారు. మాటు వేసి మరీ కోట్ల రూపాయల విలువ చేసే ఎర్రచందనాన్ని పట్టేసుకున్నారు. ఈ సందర్భంగా ఎర్రచందనాన్ని తరలిస్తున్న ఓ కంటైనర్ లారీతో పాటు ముగ్గురు అంతరాష్ట్ర స్మగ్లర్లను ప‌ట్టుకున్నారు. ఇటీవలి కాలంలో ఓ కంటైనర్ నిండా సరుకును పట్టుకోవడం ఇదే ప్రథమమని చెప్పాలి.

- Advertisement -

రూ.4.5 కోట్ల విలువ చేసే ఎర్రచందనం దుంగలు స్వాధీనం
చిత్తూరు నగరంలో కలెక్టరేట్ నుంచి కొన్ని కిలో మీటర్ల దూరం వెళితే… రాష్ట్ర సరిహద్దు దాటేసి తమిళనాడులో అడుగుపెట్టవచ్చు. అంతా అటవీ ప్రాంతమే. గుడిపాల మండలంలోని మూడు గ్రామాలు దాటితే అంతరాష్ట్ర సరిహద్దు వచ్చేస్తుంది. అక్కడికి సమీపంలో అటవీ దారి నుంచి వచ్చే రోడ్డును ప్రధాన రహదారిలో కలిపేందుకు ఓ అండర్ పాస్ ఉంది. ఎస్పీ సుబ్బారాయుడు తన బృందంతో అక్కడే నిఘా వేశారు.

అదే సమయంలో అటుగా మెయిన్ రోడ్డు ఎక్కుతున్న కంటెయినర్ ను తనిఖీ కోసం నిలపగా… దానిని వదిలేసి స్మగ్లర్లు పరారయ్యేందుకు యత్నించారు. దీంతో అలర్ట్ అయిన సుబ్బారాయుడు బృందం.. వారిని ప‌ట్టుకుని కంటెయినర్ ను ఓపెన్ చేయగా రూ.4.5 కోట్ల విలువ చేసే ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. కంటెయినర్ సహా ఎర్రచందనాన్ని గోడౌన్ కు తరలించిన సుబ్బారాయుడు అంతరాష్ట్ర స్మగ్లర్లుగా గుర్తించి ముగ్గురిని కటకటాల వెనక్కి పంపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement