- కర్నూలు తాలూకా సీఐ రాముడుపై కేసు నమోదు
కర్నూల్ ప్రతినిధి: కర్నూల్ జిల్లాలో ఓ సీఐ హద్దులు మీరాడు. ఏకంగా ఎస్పీ పేరుతోనే వసూళ్లకు తెగబడ్డాడు.
కర్నూలు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి పేరుతో కర్నూల్ తాలూకా అర్బన్ సీఐ కంబగిరి రాముడు అవినీతి చిట్టా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 19న కర్నూలు మండలం పంచలింగాల చెక్ పోస్టు వద్ద. స్పెషల్ ఎన్‌ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులు హైదరాబాద్ నుంచి తమిళనాడు వెళ్తున్న ఓ బస్‌ను తనిఖీ చేశారు. తమిళనాడుకు చెందిన సతీష్ బాలకృష్ణ అనే ప్రయాణికుడు వద్ద. రూ 75 లక్షలు గుర్తించారు. ఆ డబ్బుతో పాటు అతనిని ని కర్నూల్ తాలూకా అర్బన్ పోలీసుల కు అప్పగించారు. పట్టుబడిన నగదు కు సంబంధించిన పత్రాలను అతను పోలీసులకు చూపారు. సీఐ కంబగిరి రాముడు మొత్తం సొమ్ము తిరిగి ఇవ్వకుండా. జిల్లా ఎస్పీకి ఇవ్వాలంటూ. రూ 15లక్షలు బలవంతంగా తీసుకున్నారు. అందులో ఐదు లక్షలు ముగ్గురు మధ్యవర్తులకు ఇచ్చారు. మిగతా రూ 10 లక్షలు తన వద్ద ఉంచుకుని మిగిలిన 60 లక్షలను సతీష్ బాలకృష్ణకు ఇచ్చారు. దీనిపై బాధితుడు పోలీసు ఉన్నతాధికారులకు తెలిపారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్ పి సుధీర్ కుమార్ రెడ్డి సీఐ పై అదే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పర్చాలని ఆదేశాలు జారీ చేశారు. సతీష్ బాలకృష్ణ ఫిర్యాదు మేరకు ఎస్సై లక్ష్మీనారాయణ సీఐ తో పాటు ముగ్గురు మధ్యవర్తుల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ లోపు సదరు సీఐ విజయవాడకు వెళ్తున్నట్లు తెలుసుకొని అతను అరెస్టు చేసి తీసుకు వచ్చేందుకు జిల్లా రక్షణాధికారి ప్రత్యేక పోలీసు బృందాలను పంపారు. కాగా సదరు సీఐ పరారీలో ఉన్నట్లు సమాచారం. ముగ్గురు మధ్యవర్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని క్షేత్రస్థాయిలో విచారిస్తున్నారు.