అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో వర్షాలు జోరు అందుకుంటున్నాయి. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదవుతోంది. నైరుతి రుతుపవనాలు ఈనెల 5 తేదీకి రావాల్సి ఉండగా 13వ తేదీకి రాయలసీమను తాకాయి. క్రమేపీ రాష్ట్రమంతటా విస్తరించాయి. ఈక్రమంలో పలు ప్రాంతాల్లో పుష్కలంగా వానలు కురుస్తున్నాయి. ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గడంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది సీజన్ ప్రారంభంలో ఎండలు దడదడ లాడించాయి. మార్చి నెల నుంచి భానుడు ప్రతాపం చూపాడు. మే నెల్లో అసని తుఫాన్ ప్రభావంతో కాస్తంత తగ్గుముఖం పట్టాయి.
ఆ తరువాత నుంచి క్రమేపీ ఎండల తీవ్రత పెరిగింది. మే మూడో వారం నుంచి జూన్ మొదటి వారం వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీనికి తోడు వడ గాడ్పులు, ఈదురు గాలులు విరుచుకుపడ్డాయి. నైరుతి రుతు పవనాల రాకతో తొలకరి పులకించింది. గడిచిన వారం రోజులుగా రాష్ట్రంలోని డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగూటంలో 114.6మి.మీ, అమలాపురంలో 98.6 మి.మీ,అల్లవరంలో 94.7 మిమీ, ముమ్మిడివరంలో 76.6, ఐ పోలవరంలో 76.5 మి.మీ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్‌లో 93.4 మిమీ, అర్బన్‌లో 76.5మి.మీ బిక్కవోలులో 78.8చ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 84.2మి.మీ, మొగల్తూరులో 80.7 మి.మీ చొప్పున అత్యధికంగా వర్షపాతం నమోదైనట్లు విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు.
తొమ్మిది జిల్లాల్లో అత్యధికం
సాధారణ వర్షపాతం కంటే సత్యసాయి జిల్లాలో 92.4 శాతం, వైఎస్‌ఆర్ కడపలో 100.3 శాతం, అన్నమయ్య జిల్లాలో 65.4, చిత్తూరులో 59.7 అనంతపురంలో 58.1 శాతం, కాకినాడ జిల్లాలో 24 శాతం, కోనసీమలో 49.9 తూర్పు గోదావరిలో 26.7, పశ్చిమ గోదావరిలో 24.3 శాతం చొప్పున వర్షపాతం నమోదైంది.
ఏడు జిల్లాల్లో సాధారణం
విజయనగరం, ఏలూరు, అనకాపల్లి, పొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంధ్యాల, తిరుపతి జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.
పది జిల్లాల్లో అత్యల్పం
ఎన్టీఆర్ విజయవాడ జిల్లాలో 80.7 మిమీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా బుధవారం వరకు 27.4 మిమీ మాత్రమే నమోదైంది. అలాగే కృష్ణాలో -48.9 శాతం, పార్వతీపురం మాన్యంలో -47.0 శాతం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో -30.9, శ్రీకాకుళంలో -38.5, గుంలూరులో -55.0, బాపట్లలో -30.8, పల్నాడులో -55.8, ప్రకాశంలో -41.4 శాతం చొప్పున తక్కువ వర్షపాతం నమోదైంది. రుతు పవనాలు ఎనిమిది రోజులు ఆలస్యంగా రావడం వల్లే కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే తక్కు శాతంలో వర్షపాతం నమోదైందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతి ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్రంలో 566మిమీ వర్షపాతం సగటున నమోదవుతోందని.
ఈ ఏడాది కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. జులై, ఆగస్ట్ నెలల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా కడుతున్నారు. గడిచిన రెండేళ్ళుగా రాష్ట్రంలో పుష్కలంగా వానలు కురిశాయి. దీంతో సాగు, తాగు నీటి అవసరాలకు ఎలాంటి కొదవ లేకుండా పోయింది. ఈ ఏడాది కూడా వర్షాలు జోరుగా కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్న నేపథ్యంలో అన్నదాతలు హుషారుగా ఉన్నారు. గడిచిన పది రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయి..