కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన తిరుపతి వేదికగా ఇవాళ దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. దక్షిణ భారతదేశానికి చెందిన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొననున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సమావేశానికి హాజరు కావడం లేదు. తెలంగాణ తరఫున హోంశాఖ మంత్రి మహమూద్ అలీ సమావేశానికి హాజరు కానున్నారు. ఆయనతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఉన్నతాధికారులు సమావేశానికి హాజరవుతారు. సమావేశానికి సంబంధించి మొత్తం 26 అంశాలను ఎజెండాలో చేర్చారు.
2018లో బెంగళూరులో జరిగిన కౌన్సిల్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు అమలు తీరుపై సమీక్ష, తదుపరి జోనల్ కౌన్సిల్ సమావేశం నిర్వహణతో పాటు ఇతర అంశాలపై చర్చ జరగనుంది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు ప్రతిపాదించిన వాటితో పాటు ఆయా రాష్ట్రాలు ప్రతిపాదించిన అంశాలపై సమావేశంలో చర్చిస్తారు. ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలు తెలంగాణకు సంబంధించిన కొన్ని అంశాలను ప్రతిపాదించాయి. వాటిపై భేటీలో చర్చ జరగనుంది. నీటి కేటాయింపులు, అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు – రంగారెడ్డి, నక్కలగండి ఎత్తిపోతల పథకాలపై చర్చించాలని కర్నాటక ప్రతిపాదించింది.