నేను శ్రీవారి భక్తుడినే
సంప్రదాయాలను ఎప్పుడు గౌరవిస్తా
ఉద్దేశ్యపూర్వకంగా వ్యాఖ్యాలు చేయలేదు
క్లారిటీ ఇచ్చిన తమిళ హీరో కార్తీ
కోలీవుడ్ నటుడు హీరో కార్తీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు క్షమాపణలు చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యల వల్ల అనుకోని అపార్థం ఏర్పడిందని, దీని పై క్షమాపణలు కోరుతున్నట్లు చెప్పారు. తాను వేంకటేశ్వర స్వామి భక్తుడినని అన్నారు.
‘ప్రియమైన పవన్ కల్యాణ్ సార్.. నా వ్యాఖ్యల వల్ల అనుకోని అపార్థం ఏర్పడినందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను. నేను వేంకటేశ్వర స్వామి భక్తుడిని. ఎల్లప్పుడూ మన సంప్రదాయాలను గౌరవిస్తాను.’ అని కార్తీ ట్వీట్ చేశారు.
అసలేం జరిగిందంటే..?
కార్తీ నటిస్తున్న మూవీ ‘సత్యం సుందరం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో లడ్డూ కావాలా నాయనా.. ఇంకో లడ్డూ కావాలా నాయనా అని యాంకర్ ప్రశ్నించింది. దీనిపై కార్తీ స్పందిస్తూ.. ఇప్పుడు లడ్డూ గురించి మాట్లాడకూడదు. ఆ టాఫిక్ చాలా సెన్సిటివ్.. మనకు వద్దు అని అన్నాడు.
తిరుమల శ్రీవారి లడ్డూ మహా ప్రసాదం కల్తీ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తున్న సమయంలో కార్తి లడ్డూపై చేసిన వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. కొందరు లడ్డూ మీద జోకులు వేస్తున్నారని అన్నారు. ‘నిన్న ఒక సినిమా ఫంక్షన్ చూశాను. లడ్డూ టాఫిక్ చాలా సెన్సిటివ్ అని అన్నారు. లడ్డూ టాఫిక్ సెన్సిటివ్ కాదు.. దయచేసి ఎవ్వరూ అలా అనొద్దు.’ అని పవన్ అన్నారు. ఈ క్రమంలోనే కార్తీ క్షమాపణలు చెప్పారు.