Friday, November 22, 2024

హెచ్టీ పత్తికి త్వరలో అనుమతి.. బీటీ కూరగాయలు, వరి వంగ‌డాల‌పై కసరత్తు

అమరావతి, ఆంధ్రప్రభ : జన్యు మార్పిడి (జీఎం) సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కలుపు నివారిణిని తట్టుకుని నిలబడగలిగే (హెర్బిసైడ్‌ టాలరెన్స్‌-హెచ్టీ) పత్తి అందుబాటులోకి రానుంది.గ్లోఫోసేట్‌ (కలుపు నివారిణి) చల్లినప్పుడు కేవలం కలుపు మాత్రమే చనిపోయి పత్తి మొక్కకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆ విధంగా జన్యు మార్పిడి ద్వారా హెచ్టీ కాటన్ను అభివృద్ధి చేశారు. తుది అనుమతి ఇచ్చేందుకు దీనికి సంబంధించిన డేటాను జెనిటిక్‌ ఇంజనీరింగ్‌ అప్రైజల్‌ కమిటీ పరిశీలిస్తోంది. వచ్చే మూడు నెలల్లో హెచ్టీ పత్తికి అనుమతి లభించే వీలుందని ఫెడరేషన్‌ ఆఫ్‌ సీడ్‌ ఇండస్ట్రీ ఇండియా (ఎఫ్‌ఎఐ్సఐ) డైరెక్టర్‌ జనరల్‌ రామ్‌ కౌడిన్య తెలిపారు. మహికో కంపెనీ హెచ్టీ కాటన్ను అభివృద్ధి చేసింది.

ర్యాలీస్‌, బయోసీడ్‌ కంపెనీలు కూడా హెచ్టీ కాటన్ను అభివృద్ధి చేస్తున్నాయి. ఇప్పటికే బీటీ (బాసిల్లస్‌ తురింజిన్సిస్‌) పత్తిని సాగు చేస్తున్నారు. గులాబీ రంగు పత్తికాయ తొలుచు పురుగు ఇబ్బందులను అధిగమించడానికి జన్యు మార్పిడి ద్వారా బీటీ కాటన్ను అభివృద్ధి చేశారు. ఈ పురుగుకు రెసిస్టెన్స్‌ పవర్‌ రావడంతో మూడో తరం బీటీ కాటన్ను అభివృద్ధి చేసే ప్రక్రియ జరుగుతోందని కౌండిన్య తెలిపారు.

- Advertisement -

బీటీ కూరగాయలు, వరి అభివృద్ధిపై కసరత్తు

జన్యు మార్పిడి ద్వారా అభివృద్ధి చేసిన హెచ్టీ ఆవాలకు ఇటీవల జెనిటిక్‌ ఇంజనీరింగ్‌ అప్రైజల్‌ కమిటీ ఆమోదం తెలిపింది. గ్లూఫోసినేట్‌ అనే కలుపు నివారిణిని చల్లినప్పుడు కలుపు మాత్రమే పోయి అవాల మొక్కలకు ఎటువంటి హాని లేకుండా జన్యు మార్పిడి చేసి హెచ్టీ అవాలను అభివృద్ధి చేశారు. బీటీ, హెచ్టీ మొక్కజొన్నను అభివృద్ధి చేసే ప్రక్రియ జరుగుతోంది. కూరగాయల్లో బీటీ- వంకాయను అభివృద్ధి చేశారు. బీటీ బెండ, క్యాబేజీ, టమాటాలను తయారు చేసే ప్రక్రియ జరుగుతోంది. బీటీ వరిని కూడా అభివృద్ధి చేస్తున్నారు. కాగా ఎరువుల వాడకాన్ని తగ్గించడానికి నైట్రోజన్‌ యూజ్‌ ఎఫీషియెన్సీ (ఎన్యూఈ), ఫాస్ఫరస్‌ యూజ్‌ ఎఫీషియెన్సీ (పీయూఈ) ఎక్కువగా ఉండే వరి రకాలను అభివృద్ధి చేస్తున్నట్లు కౌండిన్య తెలిపారు. ఈ రకాల వల్ల పొలంలో చల్లే ఎరువుల శాతాన్ని 30-40 శాతం తగ్గించవచ్చు.

3.6 కోట్ల బేళ్ల పత్తి ఉత్పత్తి..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏటా 3.6 కోట్ల బేళ్ల పత్తి ఉత్పత్తి అవుతోందని కౌండిన్య చెప్పారు. 2026 నాటికి టెక్స్టైల్‌ పరిశ్రమకు 4.5 కోట్ల బేళ్ల పత్తి అవసరమవుతుందని అంచనా వేస్తున్నారని. ఈ స్థాయిలో ఉత్పత్తికి బీటీ పంటల అవసరం ఉందన్నారు. బీటీ కాటన్‌ విత్తన ప్యాకెట్‌ ధర ఎక్కువగా ఉన్నా. లభించే ఆదాయం దాని కంటే అనేక రెట్లు ఎక్కువగా ఉంటుంది. మొత్తం సాగు వ్యయంలో విత్తన వ్యయం 5 శాతం కంటే తక్కువగా ఉంటుంది.

విత్తన పరిశ్రమ ఏటా రూ.23,000 కోట్ల విక్రయాలు

దేశీయ సంఘటిత విత్తన పరిశ్రమ ఏటా రూ.23,000 కోట్ల విలువైన విత్తనాలను విక్రయిస్తోంది. ఇది ఏటా 8 శాతం పెరుగుతోంది. ఒక్క కూరగాయల విభాగంలోనే రూ.6,500 కోట్ల విక్రయాలు జరుగుతున్నాయి. పత్తిలో ఈ విక్రయాలు రూ.4,000 కోట్లు-, వరిలో రూ.2,500 కోట్ల మేరకు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement