విశాఖపట్నం ఆంధ్ర ప్రభ బ్యూరో సోంపేట బీలను పరిరక్షించుకుందాం, ఉద్యమకారులు మీద పెట్టిన కేసులు ఎత్తి వేయించుదాం అని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యన్నారాయణ అన్నారు. ఆదివారం ఉదయం సోంపేట బీల ఉద్యమంలో అమరులైన గొనప కృష్ణమూర్తి, బెందాళం కృష్ణమూర్తి, గున్న జోగారావుల స్థూపం వద్దకు వెళ్ళి అంజలి ఘటించిన అనంతరం నిర్వహించిన 14 వ సంస్మరణ సభ లో ఆయన మాట్లాడారు.
ప్రధానంగా 329 వ జిఓ ను రద్దు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తమ పార్టీ అధ్యక్షులు, ఉపముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్ళి మాట్లాడుతానని హామీ ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి తక్షణ కర్తవ్యంగా భావించి కృషి చెయ్యాలి అని కోరారు. 23 గ్రామాల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని ప్రకటించారు.
మానవ హక్కుల వేదిక ప్రతినిధి వి ఎస్ కృష్ణ మాట్లాడుతూ ఒక రైలు ను కాల్చేసిన వారి మీద పెట్టిన కేసులు ఎత్తి వేశారు, కానీ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసిన వారి మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తి వేయకపోవడం అన్యాయం అన్నారు. బీలా భూములు పరిరక్షించండి బొగ్గు ఆధారిత విద్యుత్ పరిశ్రమ వద్దని పోరాడితే ముగ్గురు అమరులైన తర్వాత దానిని ఆపి 329 పేరు తో ఇంకో పరిశ్రమకు జిఒ ఇవ్వడం అన్యాయం అన్నారు. ఉద్యమకారుల మీద పెట్టిన కేసులు ఎత్తి వేయాలని, 329 జిఒను రద్దు చేయాలని డిమాండ్ చేశారు
.ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ సంస్థ అధ్యక్షులు డాక్టర్ వై క్రిష్ణమూర్తి, ప్రతినిధి టి. రామారావు, జిల్లా సహకార బ్యాంకు మాజీ చైర్మన్ డి జగన్ తదితరులు మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ సంస్థ, మత్స్యకారులు సంక్షేమ సంఘం, కలాసీ సంఘం ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.