Thursday, November 7, 2024

బియ్యం బకాసురులు.. పక్కదారి పడుతున్న రేషన్​ రైస్​..

కర్నూలు, ప్రభన్యూస్‌ : దారిద్రరేఖకు దిగువనున్న పేదలు పస్తులుండరాదనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వ ఆశయానికి కొందరు అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్‌ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. ముఠాగా ఏర్పడి రాత్రి వేళల్లో లారీలు, మినీ వ్యాన్‌లు, ఆటో ట్రాలీలలో పొరుగు రాష్ట్రాలకు, జిల్లాలకు రహస్యంగా తరలిస్తున్నారు. గత కొంతకాలంగా సాగుతున్న ఈ వ్యవహారంలో ఒక్క కర్నూలు జిల్లా పరిధిలోనే ప్రతినెలా 200 మెట్రిక్‌ టన్నుల బియ్యం పక్కదారి పడుతున్నది. ఈ బియ్యం తరలింపును అడ్డుకునేందుకు ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రత్యేక అధికారులు, పోలీసులకు అధికారం ఉన్నా గోప్యంగా దందా సాగుతోంది. అక్రమార్కులు దొరికితే.. దొంగలు, లేని పక్షంలో లక్షల సంపాదనతో దొరలు అన్న చందంగా పరిస్థితి మారింది.

గ్రామాల్లో చాలా వరకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న బియ్యం గురించి పేదలకు తెలియదు. రెగ్యులర్‌గా ఇచ్చే రేషన్‌ సరుకుల కోసం మాత్రమే పేదలు వెళ్తున్నారు. కేంద్రం ఇస్తున్న బియ్యం గురించి చాలాచోట్ల డీలర్లు చెప్పడం లేదు. ప్రతినెలా రెండు సార్లు ఇవ్వాల్సిన బియ్యంను ఒకేసారి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యంను తెలివిగా కొంతమంది బియ్యం వ్యాపార దళారులు, డీలర్లు కుమ్ముకై తెలివిగా వీటిని దారి మళ్లిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా నంద్యాల కేంద్రంగా పిడిఎస్‌ బియ్యం అక్రమ రవాణా బాగోత్తం కొంతకాలంగా సాగుతుంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, అక్రమ రవాణా విషయంలో చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుండటం గమనార్హం. ఈ విషయంలో సివిల్‌ సప్లయ్‌శాఖ అధికారులు డీలర్లు కుమ్ముకవుతున్నట్లు సమాచారం లేకపోలేదు. పట్టణాల్లో కొంత వరకు నెలనెల రెండుసార్లు బియ్యం పంపిణీ జరుగుతుంది కాని పల్లేలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యం దారి మళ్లుతుంది. పోలీసుల సహాకారంతో అడపాదడపా తనిఖీలు నిర్వహించి పౌరసరఫరాల శాఖ అధికారులు గతేడాది కాలంలో రూ.కోట్ల విలువచేసే బియ్యంను సీజ్‌ చేశారు. పౌరసరఫరాల శాఖ అధికారుల తనిఖీలలోనే పట్టుబడిన బియ్యం ఈ స్థాయిలో ఉంటే ఇక ఆశాఖ, పోలీసు కళ్లుగప్పి తరలిన బియ్యం ఏ స్థాయిలో ఉంటుందో గ్రహించవచ్చు. ప్రభుత్వం సరఫరా చేసిన బియ్యంను వాడుకోని ప్రజలు కిలో రూ.10 చొప్పున అమ్ముకుంటున్నారు.

ఇలా రేషన్‌ అమ్ముకునే వారి సంఖ్య కర్నూలు జిల్లాలో కర్నూలు, ఆదోని, నంద్యాల డివిజన్‌లలోనే అధికంగా ఉంది. ఇలా రేషన్‌ అమ్ముకునే వారి సంఖ్య కర్నూలు, నంద్యాల డివిజన్‌లలో అధికంగా ఉండగా, వీరంతా ఓ ముఠాగా ఏర్పడి, ప్రభుత్వం నుంచి బియ్యం సరఫరా కాగానే కొనుగోళ్లు చేపడుతున్నారు. ఇందుకు ఆయా డివిజన్‌లలోని కొంతమంది రేషన్‌ డీలర్లు కూడ సహాకరిస్తున్నట్లు ఆరోఫణలున్నాయి. ఇలా అక్రమ దందాను వ్యాపారంగా మార్చుకొన్న వ్యాపారులు ప్రతినెల రూ. కోట్ల వ్యాపార దందా సాగిస్తుండగా, ఇందులో సిండికేట్‌గా ఉన్న వ్యాపారులు ప్రతినెల లక్షలు సంపాదిస్తున్నారు.

పొరుగు రాష్ట్రాలకు లారీల్లో అక్రమంగా రేషన్‌ బియ్యం తరలిస్తున్న ముఠా ఎక్కడికక్కడ దొరకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. బియ్యం లారీలకు అరకిలోమీటర్‌ ముందు ఈ ముఠా సభ్యులు కార్లలో ప్రయాణిస్తుంటారు. పోలీసులు, అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డా తమ పేర్లు చెప్పకూడదని లారీ యజమానులతో, డ్రైవర్లతో ముఠా సభ్యులు ముందస్తూ ఒప్పందం కుదుర్చుకుంటారు. ఇందుకు అవసరమైన మేర డబ్బును ముఠా సభ్యులు లారీ యజమానులకు, డ్రైవర్లకు ఇస్తున్నట్లు సమాచారం. అందువల్లే పోలీసులు, అధికారుల తనిఖీలలో పట్టుబడినప్పుడు డ్రైవర్లు ముఠా సభ్యుల పేర్లు చెప్పడం లేదని కొందరు పౌరసరఫరాల అధికారులే పేర్కొనడం గమనార్హం. ఈ కారణంగా లారీలను సీజ్‌ చేసి డ్రైవర్లపై కేసులు నమోదు చేసి కోర్టుకు నివేదిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు కొందరు వెల్లడిస్తున్నారు. ఏది ఏమైనా ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్‌ బియ్యం వేల క్వింటాళ్లో ప్రతినెల పక్కదారి పట్టిస్తున్న ముఠాల ఆగడాలను ఎలా అరికడతారన్నది ప్రస్తుతం బేతాళ ప్రశ్నగా మారింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement