న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటే వేదంగా, శాసనంగా భావించి పని చేసుకుపోయే మంత్రి గౌతంరెడ్డి ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని వైఎస్సార్సీపీ నేతలు, పార్లమెంట్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి స్మృత్యర్థం మంగళవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ భవన్‌లోని అంబేద్కర్ ఆడిటోరియంలో సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ, పార్లమెంటు సభ్యులు రెడ్డప్ప, తలారి రంగయ్య, గురుమూర్తి, సత్యవతి, గోరంట్ల మాధవ్, చంద్రశేఖర్, ప్రభుత్వ సలహాదారు ప్రభాకర్ సింగ్, ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్, స్పెషల్ కమిషనర్ ఎన్. వి. రమణా రెడ్డితో పాటు ఏపీ భవన్ ఉద్యోగులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన గావించి గౌతంరెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ, పార్లమెంట్ సభ్యులు గౌతంరెడ్డితో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. నిరాడంబరుడు, మృదు స్వభావి, ఎంతో విషయ పరిజ్ఞానం కలిగిన గౌతంరెడ్డి రాష్ట్రాభివృద్ధికి చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. దుబాయ్ పర్యటన తర్వాత రాష్ట్రంలో పరిశ్రమలకు సంబంధించి శుభవార్త వింటామనుకుంటున్న తరుణంలో దుర్వార్త వినాల్సి వచ్చిందని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం పీఆర్సీ ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ… పరిశ్రమలు, ఐటీ విషయంలో గౌతంరెడ్డి ముందుచూపును, రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి చేసిన సేవలను కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా స్కిల్ సెంటర్ల ఏర్పాటు చేయాలన్న గౌతంరెడ్డి ఆలోచన కార్యరూపం దాల్చాలని ఆకాంక్షించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..