Saturday, September 21, 2024

AP | ఇంటర్‌ అర్హతతోనే సాప్ట్‌వేర్‌ ఉద్యోగం.. హెచ్‌సీఎల్‌తో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒప్పందం

అమరావతి, ఆంధ్రప్రభ : ప్రస్తుతం యువత ఎక్కువగా సాప్ట్‌వేర్‌ ఉద్యోగాలే లక్ష్యంగా విద్యాభ్యాసం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు బీటెక్‌లో ఐటీ లేదా సీఎస్‌ఈ గ్రూపు పూర్తయిన వారికే సాప్ట్‌వేర్‌ ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉండేవి. అయితే ఇటీవల కాలంలో ఇతర గ్రూపులకు చెందినవారు కూడా సాప్ట్‌వేర్‌ కు సంభందించిన కోర్సులు పూర్తి చేసి ఉద్యోగావకాశాలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు కేవలం ఇంటర్మీడియట్‌ అర్హతతోనే సాప్ట్‌వేర్‌ ఉద్యోగం పొందేలా రాష్ట్ర ప్రభుత్వం అద్భుత అవకాశం కల్పించేందుకు కార్యాచరణ రూపొందించింది.

భారతదేశపు అతిపెద్ద ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్‌తో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఇంటర్మీడియట్‌ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మంచి ఉద్యోగావకాశాలను అందిస్తోంది ప్రభుత్వం. హెచ్‌సీఎల్‌ టెక్‌బీ పేరుతో అమలు చేస్తున్న ఈ అసాధారణ కార్యక్రమంపై విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది.

ఇందులో భాగంగా తొలిసారిగా ప్రయోగాత్మకంగా అనకాపల్లి ఏఎంఏఎల్‌ కళాశాలలో ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాళ్లకు హెచ్‌సీఎల్‌ సంస్థ ప్రతినిధులు ఏర్పాటు చేసిన అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఇలాంటి మంచి అవకాశంపై విద్యార్థులందరికీ కళాశాలల ప్రిన్సిపాళ్లు వివరించి అవగాహన కల్పించాలన్నారు. చిన్న వయసులోనే సాప్ట్‌వేర్‌ కొలువులతోపాటుగా ఉన్నత విద్య చదువుకునే వీలుంటుందన్నారు.

- Advertisement -

దీనిని విద్యార్థులంతా సద్వినియోగ పర్చుకునేలా చూడాలని ప్రిన్సిపాళ్లను కోరారు. హెచ్‌సీఎల్ టెక్‌బీ ప్రోగ్రాం గురించి సంస్థ రాష్ట్ర ప్రతినిధులు పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా సమగ్రంగా వివరించారు. 2023, 2024 సవత్సరాల్లో ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థులు హెచ్‌సీఎల్‌ ఎర్లీ కెరీర్‌ ప్రోగ్రాంకు అర్హులని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే ఎంపిక ప్రక్రియ ఉంటుంది. తొలుత నిర్వహించే ఆన్‌లైన్‌లో పరీక్షలో ఎంపికైన వారికి హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూ ఉంటుంది.

ఎంపికైన విద్యార్థులు హెచ్‌సీఎల్ టెక్‌బీ ప్రోగ్రాంలో చేరడానికి ఆఫర్‌ లెటర్‌ పొందుతారని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఆ తర్వాత ఏడాది కాలపరిమితితో టెక్‌బీ శిక్షణ ఉంటుంది. విజయవాడ, హైదరాబాద్‌, బెంగుళూరుల్లో హెచ్‌సీఎల్‌ క్యాంపస్‌లకు వెళ్లి ఒక నెల శిక్షణ తీసుకోవాలి. అనంతరం మరో ఐదు నెలలు ఇంటి వద్ద నుంచే ఆన్‌లైన్‌ శిక్షణ పొందవచ్చు. ఇందుకోసం అభ్యర్థులకు ల్యాప్‌ ట్యాప్‌తో పాటు ఇంటర్‌నెట్‌ ఛార్జీలు సంస్థ ఇస్తుంది.

అనంతరం ప్రారంభంలోనే రూ.10 వేల స్టేఫండు ఆరు నెలలు చెల్లిస్తారు. తర్వాత ప్రతిభా ఆధారంగా సాప్ట్‌వేర్‌తో పాటు ఇతర రంగాల్లో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందని వారు తెలిపారు. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాల కోసం తమ సంస్థ దేశంలో ప్రముఖ విశ్వవిద్యాలయాలు, ఐఐటీ, ఐఐఎంలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇదిలా వుండగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా హైస్కూల్‌ విద్య నుంచే ఐటీ కోర్సులకు సంబంధించిన శిక్షణ నివ్వాలని నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement