Sunday, November 17, 2024

ఆటలో ఓడి జీవితాన్ని వదులుకున్న సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్.. సైబర్‌ సెల్‌ అప్రమత్తం..

అమరావతి, ఆంధ్రప్రభ : ఆన్‌లైన్‌ మోసాలకు అమాయకులు బలవుతున్నారు. వెబ్‌సైట్లలో లభించే వివిధ రకాల ఆకర్షణీయమైన యాప్‌లను వినియోగిస్తున్న ఎంతో మంది యువతీ యువకులు లక్షల్లో డబ్బు పొగొట్టుకుని చేసేదేమీ లేక అవమాన భారంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఎన్టీఆర్‌ జిల్లా చిల్లకల్లు వద్ద చెరువులో మునిగి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ జాస్తి శ్వేత ఉదంతమే ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలో కలకలం రేపిన ఈ ఘటనతో సైబర్‌ క్రైం విభాగం అప్రమత్తమైంది. గత కొంతకాలంగా రాష్ట్రంలో ఈ తరహా ఆన్‌లైన్‌ మోసాలు, సైబర్‌ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తెలంగాణాలో ఇప్పటికే వీటి బారిన పడి విద్యార్ధులు, యువకులు ప్రాణాలు తీసుకున్నారు. ఏపీలో ఇటీవల కాలంలో శ్వేత బలవన్మరణమే తాజా ఉదంతం. గతంలో కూడా తిరుపతి, విశాఖ పలుచోట్ల కొందరు సైబర్‌ నేరాలు, ఆన్‌లైన్‌ మోసాల బారిన పడి ప్రాణాలు తీసుకున్న ఘటనలు లేకపోలేదు. కొద్దిరోజుల క్రితం కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఓ బాలుడు ఆన్‌లైన్‌ గేమ్‌ పబ్జీలో ఓడి అవమానం భరించలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం కలిగించింది. బాలుని బలవన్మరణం తర్వాత అదే తరహాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు శ్వేత కూడా ఆన్‌లైన్‌ గేమ్‌లో భారీగా డబ్బు పొగొట్టుకుని ఇక దిక్కు లేని పరిస్ధితిలో ప్రాణాలు తీసుకున్నట్లు ప్రాధమికంగా పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు.

దీంతో ఆన్‌లైన్‌లో జరుగుతున్న మోసాలకు పసిగట్టేందుకు రాష్ట్ర పోలీసుశాఖలోని సైబర్‌ విభాగం అప్రమత్తమైంది. సైబర్‌ మోసాల బారిన పడి నష్టపోయిన బాధితుల నుంచి ఫిర్యాదులు అందుకున్న మీదట దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేయడం, వీలుంటే బాధితులకు న్యాయం చేయడం ఇప్పటి వరకు కొనసాగుతున్న ప్రక్రియే. అయితే మొన్న మచిలీపట్నంలో బాలుడు, నిన్న చిల్లకల్లులో శ్వేత ఉదంతాల నేపధ్యంలో సైబర్‌ సెల్‌ ఆన్‌లైన్‌పై నిఘా పెట్టింది. వాటిలోని యాప్‌లను క్షుణ్ణంగా పరిశీలిస్తూ వీటి బారిన పడి ప్రజలు నష్టపోకుండా ముందుగానే ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టవచ్చనే కోణంలో సాంకేతిక నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. మోసాలకు ముందుగానే ఆన్‌లైన్‌లో అడ్డుకట్ట వేయడంతోపాటు వీటి అనార్ధాల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ అవగాహన కలిగించేవిధంగా చర్యలు చేపట్టేందుకు సైబర్‌ విభాగం సిద్దమైంది.

శ్వేత కేసులో మరో కోణం..

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరుకు చెందిన జాస్తి శ్వేత సాఫ్ట్ వేర్‌ ఇంజనీరుగా వర్క్‌ప్రం హోం చేస్తోంది. జగ్గయ్యపేట రూరల్‌ మండలం చిల్లకల్లు చెరువులో మునిగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తన స్వగ్రామం నుంచి దాదాపు 100 కిలోమీటర్లు ద్విచ్రక వాహనంపై ఒంటరిగా చిల్లకల్లు వెళ్ళి చెరువులో మునిగి ఆత్మహత్యకు పాల్పడింది. దానికి ముందు తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తల్లికి ఫోన్‌ మెసేజ్‌ పెట్టడం గమనార్హం. ఇదంతా సీసీ కెమేరా ఫుటేజీల ద్వారా గుర్తించిన పోలీసులు అసలు కారణాలు అన్వేషించారు. ఆమె స్నాప్‌చాట్‌ అనే యాప్‌లో నిరంతరం చాటింగ్‌ చేస్తుందని, ఈ చాట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో గేమ్‌ ఆడినట్లుగా ఆత్మహత్య కేసును దరా్యప్తు చేపట్టిన సైబర్‌ సెల్‌ పోలీసులు భావిస్తున్నారు. ఓ వ్యక్తితో చాటింగ్‌ చేస్తూ నగదు లాలాదేవీలు జరిపినట్లు ఆత్మహత్యకు పాల్పడిన తర్వాత ఆమె అకౌంట్‌ నుంచి డబ్బు గుర్తు తెలీని ఖాతాలకు వెల్ళినట్లు గుర్తించారు. సైెబర్‌ ఉచ్చులో పడి ఆమె లక్షల రూపాయలు కోల్పోయినట్లు, తన తోటి స్నేహితులను కూడా కొంత నగదు కావాలని అడగ్గా వారు నిరాకరించడంతో తీవ్ర ఒత్తిడికి గురైన క్రమంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు తేల్చారు. అయితే నగదు ట్రాన్సఫర్‌ అయిన ఖాతాలను అన్వేషించే పనిలో సైబర్‌ పోలీసులు ఉన్నారు. అకౌంట్‌ వివరాలు వ్యక్తికి సంబంధించి సమాచారం తెలియగానే మరిన్ని వాస్తవాలు వెలుగు చూస్తాయని భావిస్తున్నారు.

సీరియస్‌గా తీసుకున్న మహిళా కమిషన్‌..

- Advertisement -

శ్వేత కేసును మహిళా కమిషన్‌ సీరియస్‌గా తీసుకుంది. శ్వేత ఆత్మహత్యకు దారి తీసిన ఆన్‌లైన్‌ మోసంపై దృష్టి సారించి నిగ్గు తేల్చాలని సైబర్‌ విభాగం పోలీసులకు సూచించిం ది. అయితే ప్రస్తుతం ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌లని, రికవరీ కోసం వారు యువతీ యువకులను వేధించే విధానం, అదేవిధంగా ఆన్‌లైన్‌ గేమ్స్‌ ద్వారా లక్షల్లో ఆన్‌లైన్‌లో దోపిడీ చేయడం వంటి అంశాలపట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించింది. పైగా ఈ తరహా వలలో చిక్కి నష్టపోతున్న, బలవుతున్న వారంతా చదువుకున్న వారే కావడం గమనార్హం. ఈక్రమంలో అవగహన కలిగించేందుకు సైబర్‌ సెల్‌ ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement