- త్వరలో మెగా డీఎస్సీ..
- రాజకీయాలకు దూరంగా విద్యా వ్యవస్థ..
- నాలుగేళ్లలో అన్ని పాఠశాలలను 4స్టార్ రేటింగ్..
- చదువుతో పాటు నైతిక విలువలు చాలా ముఖ్యం.
బాపట్ల మున్సిపల్ హైస్కూలులో జరిగిన కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్.. పిల్లలు, తల్లిదండ్రులను చూసిన తర్వాత తనకు స్కూల్ డేస్ గుర్తుకు వచ్చాయిని చెప్పారు. ‘పిల్లల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యాశాఖ మంత్రిని కావడం నా అదృష్టం. ఏ వృత్తి చేపట్టిన వారైనా వారిని తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే. ఉపాధ్యాయులంటే నాకు ఎంతో గౌరవం. ముఖ్యమంత్రి చంద్రబాబు విజనరీ ఆలోచనలతో మన విద్యా వ్యవస్థ దేశానికే ఆదర్శంగా ఉండేలా ఆంధ్ర మోడల్ తీసుకొస్తున్నాం’ అని అన్నారు.
‘‘ఇక మెగా పీటీఎం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు మధ్య బంధం బలపడుతుందన్నారు. ఒక వ్యవస్థ బాగుపడాలంటే.. అందులో అందరూ భాగస్వామ్యం కావాలన్నారు. ఇదే లక్ష్యంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం రాష్ట్రమంతా ఒకేరోజున పండగ వాతావరణంలో నిర్వహించుకుంటున్నామని సంతోషం వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 45వేల పైచిలుకు పాఠశాలల్లో ఒకేరోజు తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించడం ఒక చరిత్ర. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టే బాధ్యతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాపై పెట్టారు. గత అయిదేళ్లలో గాడితప్పిన విద్యావ్యవస్థను గాడిలో పెట్టే బాధ్యత నాది.
ఇందులో భాగంగా రానున్న ఆరునెలల్లో రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టులను మెగా డిఎస్సీ ద్వారా భర్తీచేస్తాం. ఎన్నో సవాళ్లు నడుమ విద్యాశాఖ మంత్రి బాధ్యతలు చేపట్టిన నేను చాలెంజ్ గా తీసుకుని వ్వవస్థను సరిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తున్నాను.
విద్యా వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నానని లోకేష్ చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వ పథకాలకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ లాంటి మహనీయులు పేర్లు పెట్టాం. స్కూల్స్ లో ఒక్క జాబ్ మేళాలు తప్ప ఇతర ఏ కార్యక్రమాలు నిర్వహించకూడదు అని నిర్ణయం తీసుకున్నాను.
తల్లిదండ్రులు తమ బిడ్డల పురోగతిని తెలుసుకుని లోపాలను సరిదిద్దుకోవడానికి వీలుగా హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను అందజేస్తున్నాము. రాబోయే నాలుగేళ్లలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను 4స్టార్ రేటింగ్ చేర్చాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నాం.
బాలబాలికలు సమానమేనన్న భావన కలిగించడంతోపాటు విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు సలహాలతో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రత్యేక పాఠ్యాంశాలు ప్రవేశపెడుతున్నాం. ఎపి మోడల్ విద్యావ్యవస్థను తయారు చేసేందుకు అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తమవంతు సహకారం అందించాల్సిందిగా కోరుతున్నాను. ”అని మంత్రి లోకేష్ అన్నారు.