ఆ రెండు లోక్ సభ స్థానాల్లోని
అసెంబ్లీ సీట్లలో గాజు గుర్తు ఇతరులకు ఇవ్వబోం
మిగిలిన చోట్ల కోరుకుంటే ఇస్తాం..
అలాగే జనసేన పోటీ చేస్తున్న 21 స్థానాల్లో
గ్లాస్ గుర్తు ఆ పార్టీకే
హైకోర్టుకు తేల్చి చెప్పిన ఎన్నికల కమిషన్
అమరావతి – గాజు గ్లాసు సింబల్‌పై జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో స్వల్ప ఊరట మాత్రమే లభించింది….. గాజు గ్లాసు గుర్తు స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది జనసేన. ఆ పిటిషన్ పై నిన్న, ఈ రోజు కూడా వాదనలు జరిగాయి.. అయితే, నిన్న హైకోర్టును 24 గంటల సమయం కోరిన ఎన్నికల కమిషన్.. ఈ రోజు కీలక విషయాలను వెల్లడించింది..
జనసేన పోటీ చేస్తున్న రెండు లోక్ సభ స్థానాలలోని అసెంబ్లీ సెగ్మెంట్ లలో గాజు గ్లాసు గుర్తును ఇతర అభ్యర్థులకు ఇవ్వబోమని స్పష్టం చేసింది ఈసీ.. జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాల్లో గాజు గుర్తు ఆ పార్టీ అభ్యర్ధులకే కేటాయించామని చెప్పింది. మిగిలిన చోట్ల మాత్రం గాజు గుర్తు కోరుకున్న అభ్యర్ధులకు కేటాయించామని తెలిపింది. గుర్తింపు పొందని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఇలా చేస్తామని పేర్కొంది ఎన్నికల కమిషన్.. దీంతో.. జనసేన పార్టీ పోటీ చేస్తున్న స్థానాల్లో ఆ పార్టీకి కాస్త ఊరట లభించినట్టు అయినా.. మిగతా స్థానాల్లో మాత్రం జనసేన ఆశలపై నీళ్లు చల్లినట్టు అయ్యింది. ఇప్పటికే గాజు గ్లాస్ గుర్తును 50మందికి పైగా స్వతంత్ర అభ్యర్ధులకు కేటాయించారు.