Tuesday, November 26, 2024

Skill Case – చంద్ర‌బాబు స్క్వాష్ పిటిష‌న్ … సుప్రీం కోర్టులో విచార‌ణ సోమ‌వారానికి వాయిదా

ఢిల్లీ – స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ సోమ‌వారానికి వాయిదా ప‌డింది.. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ పై వాదనలు విన్న‌ది. చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూథ్రా, హరీశ్ సాల్వే, ఏఎం సింఘ్వీ వాదలను వినిపిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి, రంజిత్ కుమార్ వాదించారు.

వాదనల సందర్భంగా హైకోర్టు తీర్పులో 17ఏని తప్పుగా అన్వయించారని కోర్టుకు హరీశ్ సాల్వే తెలిపారు. చంద్రబాబుపై పెట్టిన కేసులు కక్షపూరితంగా ఉన్నాయని చెప్పారు. ఈ కేసు విచారణను 2021 సెప్టెంబర్ 7వ తేదీన ప్రారంభించినట్టు ఏడీజీపీ లెటర్ ను బట్టి తెలుస్తోందని కోర్టుకు తెలిపారు. విచారణ తేదీని ప్రామాణికంగా తీసుకోవాలని కోరారు. 2018లో 17ఏపై చట్ట సవరణ జరిగిందని చెప్పారు. 2018 తర్వాత నమోదైన కేసులన్నింటీకి 17ఏ వర్తిస్తుందని తెలిపారు. నేరం ఎప్పుడు జరిగిందనేది ముఖ్యం కాదని, ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదు చేశారనేదే ముఖ్యమని అన్నారు. హైకోర్టు తీర్పు, సీఐడీ అభియోగాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని చెప్పారు. సింఘ్వీ తన వాదనలు వినిపిస్తూ రాఫెల్ కేసులో యశ్వంత్ సిన్హా కేసులు ఉదహరించారు.

అనంత‌రం ప్ర‌భుత్వ త‌రుపున ముకుల్ రోహ‌త్గి త‌న వాద‌న‌లు వినిపిస్తూ, ఈ కేసులో 17 ఎ చ‌ట్టం వ‌ర్తించ‌ద‌ని తెలిపారు. దీనికి సంబంధించి గ‌తంలో ఇచ్చిన తీర్పుల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు

ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ సోమవారం లోపు సమర్పించాలని సీఐడీ తరఫు న్యాయవాది ముకుల్ రోహాత్గీని సుప్రీంకోర్టు ఆదేశించింది. 

- Advertisement -

దీనిపై రోహాత్గీ స్పందిస్తూ, అఫిడవిట్ వేసేందుకు సమయం కావాలని కోర్టును కోరారు. మరోవైపు, చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా స్పందిస్తూ, తాము మొత్తం వివరాలతో సిద్ధంగా ఉన్నామని సుప్రీం ధర్మాసనానికి విన్నవించారు. 

ఈ కేసులో చంద్రబాబు తరఫున లూథ్రాతో పాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, మను సింఘ్వీ కూడా వాదనలు వినిపించారు. 

బెయిల్ కోసం వెళ్లకుండా క్వాష్ పిటిషన్ పైనే వాదిస్తున్నారని ఏపీ సీఐడీ న్యాయవాది ముకుల్ రోహత్గీ ఆరోపణలు చేశారు. చంద్రబాబుకు 17ఏ వర్తించదని అన్నారు. 2018లో 17ఏ సవరణ జరిగిందని, స్కిల్ నేరం అంతకుముందే జరిగిందని కోర్టుకు వివరించే ప్రయత్నం చేశారు. 2018కి ముందు జరిగిన వాటికి 17ఏ వర్తించదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. వందల కోట్ల అవినీతి జరిగిందని రోహత్గీ పేర్కొన్నారు. 

జస్టిస్ బేలా త్రివేది స్పందిస్తూ… అవినీతి సంగతి తర్వాత, ముందు 17ఏ గురించి చెప్పండి అని ప్రశ్నించారు. సెక్షన్ 17ఏ అవినీతి కేసులకు మాత్రమే వర్తిస్తుందా? లేక అన్ని కేసులకు వర్తిస్తుందా? అని అడిగారు. అన్ని కేసులకు వర్తిస్తుందని చంద్రబాబు తరఫు న్యాయవాది సాల్వే బదులిచ్చారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుతో కూడుకున్నదని సాల్వే స్పష్టం చేశారు. 

మరో న్యాయవాది మను సింఘ్వీ 17ఏ అంశంపై వాదనలు వినిపించారు. చంద్రబాబు అవినీతికి పాల్పడినట్టు సీఐడీ ఒక్క ఆధారం కూడా చూపలేకపోయిందని మను సింఘ్వీ కోర్టుకు వివరించారు. 

కాగా, స్కిల్ డెవలప్ మెంట్ కేసులో దర్యాప్తు ఎప్పుడు ప్రారంభమైందని జస్టిస్ అనిరుధ్ బోస్ ఆరా తీశారు. ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదైందని అడిగారు. 2021 డిసెంబరు 9న ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చంద్రబాబు న్యాయవాది హరీశ్ సాల్వే కోర్టుకు తెలిపారు. ఒకదాని వెంట ఒకటి ఎఫ్ఐఆర్ లు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. సిద్ధార్థ లూథ్రా కలుగజేసుకుంటూ, ఈ కేసులో చంద్రబాబును సుదీర్ఘకాలం జైల్లో ఉంచాలన్న కక్ష సాధింపు స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు.

…అనంత‌రం విచార‌ణ‌ను సోమ‌వారానికి వాయిదా వేస్తున్న‌ట్లు ధ‌ర్మాస‌నం ప్ర‌క‌టించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement