Tuesday, November 26, 2024

Skill Case – చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌.. విచారణ వెకేషన్‌ బెంచ్‌కు బదిలీ

అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వెకేషన్‌ బెంచ్‌కు బదిలీ అయింది. బెయిల్ పిటిషన్‌పై విచారణను వెకేషన్‌ బెంచ్‌కు బదిలీ చేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోరారు. వాదనల అనంతరం చంద్రబాబు తరఫు న్యాయవాదుల అభ్యర్థనకు హైకోర్టు అంగీకరించింది. దీంతో బెయిల్‌ పిటిషన్‌పై దసరా సెలవుల్లో హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ విచారణ చేపట్టనుంది.

చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోరారు. ఈ కేసులో ఇతర నిందితులు బెయిల్‌పై ఉన్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. గడిచిన 40 రోజులుగా దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదని పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. చంద్రబాబు ఆరోగ్యంపై తాజా పరిస్థితి తెలుసుకునేందుకు మధ్యాహ్నం వరకు సమయం ఇవ్వాలని కోర్టును ఏఏజీ కోరారు. మధ్యాహ్నం మరోసారి వాదనలు విన్న ధర్మాసనం విచారణను వెకేషన్ బెంచ్‌కు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై హైకోర్టులో ఐఏ పిటిషన్‌ దాఖలైంది. ఐఏ పిటిషన్‌పైనా విచారణను వెకేషన్‌ బెంచ్‌ చేపడుతుందని జడ్జి తెలిపారు. వెంటనే చంద్రబాబు ఆరోగ్య నివేదికను వెకేషన్‌ బెంచ్‌కు ఇవ్వాలని రాజమహేంద్రవరం జైలు అధికారులను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement