Saturday, November 23, 2024

Delhi: ఏపీకి ఆరో విడత రెవెన్యూ లోటు నిధులు.. 879.08 కోట్లు విడుదల చేసిన కేంద్రం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ సహా మొత్తం 14 రాష్ట్రాలకు కేంద్రం రెవెన్యూ లోటు నిధులను విడుదల చేసింది. సెప్టెంబర్ వాటా కింద మొత్తం రూ. 7,183.42 కోట్లు విడుదల చేయగా, అందులో ఆంధ్రప్రదేశ్ వాటా రూ. 879.08 కోట్లు ఉన్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు మొత్తం రూ. 43,100.50 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రాష్ట్రాలు రూ. 86,201 కోట్లు రెవెన్యూ లోటు కింద అందుకుంటాయని వెల్లడించింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 275 ప్రకారం.. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రెవెన్యూ లోటును ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా లోటును భర్తీ చేయడానికి నిధులు విడుదల చేస్తోంది. అందులో భాగంగా తాజాగా 6వ నెల (సెప్టెంబర్) వాటా కింద మంగళవారం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సెప్టెంబర్ వాటాతో కలుపుకుని ఇప్పటి వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 5,247.50 కోట్లు అందుకుంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు రెవెన్యూ లోటు నిధులు అందుకుంటున్న రాష్ట్రాల్లో అస్సాం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాల్యాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement