తిరుపతి, జులై 8 (ప్రభ న్యూస్ బ్యూరో) దైవదర్శనం కోసం వెళ్తూ తిరిగిరాని లోకాలకు వెళ్లింది ఓ కుటుంబం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కుటుంబం శ్రీకాళహస్తి ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళ్తుండగా వారిని లారీ రూపంలో మృత్యువు బలితీసుకుంది. ఈ విషాద ఘటన తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి ఏర్పేడు మార్గంలోని మిట్టకండ్రిగ వద్ద ఆదివారంనాడు జరిగింది.భక్తులు వెళ్తున్న కారు అతి వేగం తో లారీని ఢీకొట్టడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు సైతం ఉన్నారు.
విజయవాడకు చెందిన ఓ కుటుంబం దైవదర్శనార్థం తిరుపతికి చేరుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకుని మెుక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీకాళహస్తి ఆలయాన్ని దర్శించుకునేందుకు తిరుమల నుంచి బయలుదేరారు. అయితే శ్రీకాళహస్తి ఏర్పేడు మార్గంలోని మిట్టకండ్రిగ వద్ద టీ స్టాల్‌కు వెళ్లాలనుకున్నారు. ఇంతలో వారిని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.
రాంగ్ రూట్ లో కారు ప్రయాణించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఇకపోతే మృతులంతా విజయవాడకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. శ్రీకాళహస్తి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత వీరంతా విజయవాడ వెళ్లాల్సి ఉంది. అయితే ఇంతలోనే ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.