Monday, November 25, 2024

ఆరు లైన్ల రహదారి.. మొదలు కానున్న బైపాస్ పనులు..

ప్ర‌భ‌న్యూస్ : విజయవాడ నగర ప్రజల చిరకాల వాంఛగా మిగిలిన బైపాస్‌ రోడ్డుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. గత ఐదేళ్లుగా ఆగిపోయిన పనులు ఇప్పుడే పున: ప్రారంభమయ్యాయి.. గన్నవరం మండలం చిన్నవుటుపల్లి నుంచి గొల్లపూడి వరకు అక్కడి నుంచి గుంటూరు జిల్లా చినకాకాని వరకు ఆరు లైన్ల జాతీయ రహదారి ఏర్పాటు కానుంది. దీంతో విజయవాడ – చెన్నై, చెన్నె – కోల్‌కత, విజయవాడ – హైదరాబాద్‌ మార్గాల్లో (ఎన్‌హెచ్‌-16,65) అనుసంధానం కానున్నాయి. ఇందులో భాగంగా కృష్ణానదిపై కృష్ణాజిల్లా గొల్లపూడి నుంచి అమరావతి పరిధిలోని వెంకటపాలెం గ్రామం వరకు కృష్ణానదిపై 3.5 కిలోమీటర్ల మేర వంతెన నిర్మాణానికి మార్గం సుగమమైంది. గత దశాబ్ద కాలం క్రితం గామన్‌ ఇండియా సంస్థ విజయవాడ బైపాస్‌ పనులు దక్కించుకుంది. అయితే డీపీఆర్‌లో జాప్యంతో పాటు రాష్ట్ర విభజన అనంతరం 2016లో అమరావతి ప్రాంత ప్రాథికార అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి రావటంతో గత తెలుగుదేశం ప్రభుత్వం అమరావతికి ఐకానిక్‌ వంతెన నిర్మిస్తూ బైపాస్‌ ఏర్పాటు చేయాలని పట్టుపట్టింది. అయితే ఇది సాధ్యపడదని కాంట్రాక్ట్‌ సంస్థ నిరాకరించింది.

దీంతో గత ఐదేళ్లుగా అమరావతి గ్రామాలను తాకుతూ ఏర్పాటు కావాల్సిన ఈ బైపాస్‌ రోడ్డు పనులు నిలిచిపోయాయి. దీంతో ఎన్‌హెచ్‌ఏఐ సంస్థ ఇటీవలే పనులు ప్రారంభించింది. నాలుగో ప్యాకేజీగా గొల్లపూడి నుంచి వెంకటపాలెం వంతెనతో పాటు చినకాకాని వరకు రహదారి నిర్మాణం (18 కిలోమీటర్లు) మేర ఆదానీ, నవయుగ కనస్ట్రక్షన్స్‌ కంపెనీలు జాయింట్‌ వెంచర్‌గా పనులు చేపట్టాయి. గన్నవరం మండలం చినవుటుపల్లి నుంచి గొల్లపూడి వరకు 30 కిలోమీటర్ల రహదారిని మరో సంస్థ చేజిక్కించుకుంది. చినవుటుపల్లి, నున్న మీదుగా గొల్లపూడి వరకు రహదారి విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. విజయవాడ బైపాస్‌లో భాగంగా చినవుటుపల్లి నుంచి మంగళగిరి మండలం చినకా కాని వరకు 48 కిలోమీటర్ల మేర ఆరు లైన్ల రహదారి వచ్చే ఏడాది నాటికి పూర్తికాగలదని చెప్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement