న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో 5వ నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర రెడ్డి భార్య తులసమ్మ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం హత్యకు విస్తృతస్థాయిలో కుట్ర జరిగిందన్న ఆరోపణల్లో నిజానిజాలు నిగ్గు తేల్చాలని దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ను ఆదేశించింది. జస్టిస్ ఎం.ఆర్. షా, జస్టిస్ సీటీ రవి కుమార్‌తో కూడిన ధర్మాసనం వివేక హత్యకేసు దర్యాప్తు అధికారి రామ్ సింగ్‌ను మార్చాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ కేసుపై సోమవారం జరిగిన విచారణ సందర్భంగా దర్యాప్తులో జరుగుతున్న జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ (ఐఓ)ను మార్చాల్సిందిగా ఆదేశించింది.
కేసులో పురోగతిపై సమర్పించిన స్టేటస్ రిపోర్ట్‌లో ఎలాంటి పురోగతి లేదని, దర్యాప్తు ఈ తరహాలో జరిగేతే నిందితులకు శిక్ష విధించడం కష్టమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రెండ్రోజుల్లో సీబీఐ ఉన్నతాధికారులతో మాట్లాడి ఏ విషయం చెప్పాలని సీబీఐ తరఫు న్యాయవాదులకు సూచించింది. బుధవారం మధ్యాహ్నం గం. 12.00 సమయంలో కేసు విచారణకు రాగా.. దర్యాప్తు అధికారిగా రామ్ సింగ్‌ను కొనసాగిస్తూ మరో దర్యాప్తు అధికారిని నియమిస్తున్నట్టు సీబీఐ తరఫు న్యాయవాదులు ధర్మాసనానికి తెలిపారు.
ఈ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేసిన జస్టిస్ ఎం.ఆర్. షా తమతో ఆదేశాలు ఇప్పించుకోవద్దని అన్నారు. దర్యాప్తులో పురోగతి లేనప్పుడు రామ్ సింగ్‌ను కొనసాగించడంలో అర్ధంలేదని వ్యాఖ్యానించారు. దర్యాప్తులో జాప్యం జరుగుతున్నందున నిందితుడు శివశంకర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని పిటిషనర్ తులసమ్మ తరఫు న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు. ఏప్రిల్ 15 లోగా దర్యాప్తు పూర్తి చేసి చివరి చార్జిషీట్ దాఖలు చేస్తామని సీబీఐ తరఫు న్యాయవాదులు తెలిపారు. దర్యాప్తు అధికారిని మార్చితే విచారణ పూర్తిచేయడానికి కనీసం మరో 3 నెలలు పడుతుందని తెలిపారు. అయినప్పటికీ ధర్మాసనం ఈ వాదనతో ఏకీభవించలేదు. సీబీఐ ఉన్నతాధికారులతో మాట్లాడి మధ్యాహ్నం గం. 2.00 వరకు ఏ విషయం చెప్పాలని జస్టిస్ ఎం.ఆర్. షా వ్యాఖ్యానించారు.
మధ్యాహ్నం భోజన విరామం అనంతరం కేసు విచారణ చేపట్టిన ధర్మాసనం, డీఐజీ ర్యాంక్ అధికారితో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు సీబీఐ నుంచి వచ్చిన ప్రతిపాదనపై అంగీకారం తెలిపింది. వివేకానంద రెడ్డి హత్య కేసులో దాగిన విస్తృత కుట్ర కోణాన్ని బయటపెట్టాలని ఆదేశించింది. ఏప్రిల్ 30లోపు దర్యాప్తు ముగించాలని ఆదేశించింది. కొత్తగా ఏర్పాటైన సీబీఐ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) డీఐజీ కేఆర్ చౌరాసియా నేతృత్వం వహించనున్నారు.
ఈ బృందంలో ఎస్పీ వికాస్ సింగ్, అడిషనల్ ఎస్పీ ముకేష్ కుమార్, ఇన్స్పెకర్లు ఎస్.శ్రీమతి, నవీన్ పూనియా, సబ్ ఇన్స్పెక్టర్ అంకిత్ యాదవ్ ఉన్నారు. అయితే కేసు దర్యాప్తులో జాప్యాన్ని కారణంగా చూపుతూ బెయిల్ కోరిన పిటిషనర్ తులసమ్మకు నిరాశే ఎదురైంది. ఏప్రిల్ 30లోగా దర్యాప్తు పూర్తి చార్జిషీటు దాఖలు చేయాలని, 6 నెలల్లోగా ట్రయల్ (కోర్టులో విచారణ) మొదలుపెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఒకవేళ 6 నెలల్లోగా ట్రయల్ ప్రారంభించకపోతే నిందితుడు శివశంకర్ రెడ్డి సాధారణ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.