ప్రభన్యూస్: తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిల వివాదం కోర్టులో ఉండడంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్య అయినందున సామరస్యంగా కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని కేంద్రం సూచించింది. ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన విద్యుత్ బకాయిలపై లోక్‌సభలో వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ సమాధానమిచ్చారు. తెలంగాణ రాష్ట్రం నుంచి రూ. 6,111.88 కోట్ల మేర విద్యుత్ బకాయిలున్నాయని ఏపీ సీఎం లేఖ రాసిన అంశాన్ని ప్రస్తావించారు. ఏపీ, తెలంగాణ ప్రతినిధులతో సమావేశం నిర్వహించామని, ఇది విభజన అనంతరం తలెత్తిన వివాదమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఒప్పందం ప్రకారం విద్యుత్ సరఫరా జరుగుతోందని, ప్రారంభంలో ఏపీ నుంచి తెలంగాణ విద్యుత్ తీసుకునేదని కేంద్ర మంత్రి వివరించారు. ఏపీకి తెలంగాణ చెల్లించాల్సిన అసలు మొత్తానికి సంబంధించి ఎలాంటి వివాదం లేదని, అయితే ఈ అసలుపై చెల్లించాల్సిన వడ్డీపై వివాదం నెలకొందని స్పష్టం చేశారు. నియమ నిబంధనల మేరకు ఆ లెక్కలను సర్దుబాటు చేసుకోడానికి రెండు రాష్ట్రాలు అంగీకరించాయని ఆర్కేసింగ్ అన్నారు. ఆ మేరకు తెలంగాణ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ హైకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిందని వివరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital