Sunday, November 24, 2024

TTD | కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ దర్యాప్తు ప్రారంభం..

తిరుపతి, ఆంధ్రప్రభ బ్యూరో ( రాయలసీమ) : తిరుమల ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ వ్యవహారంపై శుక్రవారం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ మొదలైంది. అలిపిరి వద్ద తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేసుకున్న సిట్ నాలుగు బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా రెండు బృందాలు లడ్డూల తయారీలో నెయ్యి వినియోగం తీరు గురించి తిరుమలలో, నెయ్యి కొనుగోళ్ల విధి విధానాల గురించి తిరుపతిలో అధికారిక వివరాల సేకరణతో దర్యాప్తు మొదలైంది.

గత అయిదేళ్ల మధ్యకాలంలో తిరుమల క్షేత్ర అవసరాలకోసం టీటీడి కొనుగోలు చేసిన నెయ్యిలో కల్తీ నెయ్యి సరఫరా అయిందనే అంశం ఇటీవల సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దానిపై దాఖలైన పిటిషన్ ను స్వీకరించిన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అయిదుగురు సభ్యులతో సిట్ ఏర్పాటు కావడం కూడా విదితమే.

ఇప్పటికే ప్రాధమిక దర్యాప్తు మొదలు పెట్టిన సిట్ బృందం శుక్రవారం ఉదయం తిరుపతికి వచ్చి అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేసుకుంది. అంతేకాక సిట్ కు అనుబంధంగా పనిచేస్తున్న పోలీసు అధికారులతో నాలుగు బృందాలుగా ఏర్పడి విచారణ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. శుక్రవారం ఒక బృందం తిరుపతిలోని వివిధ టీ టీ డి విభాగాలలో నెయ్యి కొనుగోలు, ఒప్పందాలు, నాణ్యమైన నెయ్యి సరఫరా కోసం టీటీడీ, ఏఆర్‍ డైయిరీ మధ్య జరిగిన ఒప్పందాలను పరిశీలించినట్టు తెలుస్తోంది.

మరో బృందం తిరుమలకు వెళ్లి లడ్డూ పోటు, లడ్డూ విక్రయ కేంద్రాలు, లడ్డూ తయారీకి వినియోగించే ముడిసరుకులను పరిశీలించినట్టు తెలుస్తోంది. ఇందులో డిఎస్పిలు సీతారామాంజనేయులు, శివ నారాయణ స్వామి, కృష్ణమోహన్, వెంకట్రామయ్యల నేతృత్వంలోని పోలీసు అధికారుల బృందం పాల్గొన్నట్టు తెలుస్తోంది. మరో బృందం తమిళనాడులోని దుండిగల్‌కు వెళ్లి నెయ్యి సరఫరా చేసిన ఏఆర్‌ డైరీ ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు వెళ్లినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement