Friday, November 22, 2024

రైతులకు దేవుడు.. కాటన్ మహనీయుడు

బాపట్ల – తినే వాడి పేరు ప్రతి గింజ మీద రాసిపెట్టి ఉంటుంది. అయితే ఉభయగోదావరి జిల్లాల్లో మాత్రం ప్రతి గింజ మీద సర్ ఆర్థర్ కాటన్ పేరే ఉంటుంది. కాటన్ ను అన్నదాతలు ఈ జిల్లాల్లో దేవుడితో సమానంగా కొలుస్తారు. నేడు అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా ఆంధ్ర‌ప్ర‌భ‌ అందిస్తున్న ప్రత్యేకం.
ఉప్పెన, తుఫాన్ తాకిడికి సుమారు రెండు లక్షల మంది మృత్యువాత పడ్డారు. ఇది 1839 వ సంవత్సరం కోస్తా ఆంధ్రాలో కుదిపేసిన ప్రకృతి వికృత రూపం. ఉప్పెన లోనుంచి పుట్టిన కాటన్ ఆలోచనలు, అధ్యయనాలు అన్నదాతకు కొత్త ఊపిరి అందించాయి. తీవ్రమైన క్షామం తో అల్లాడుతున్న నదీ పరివాహక ప్రాంత ప్రజల ఊరు విడిచి వలస వెళ్లి పోవడం ప్రారంభించారు. పైగా గోదావరి మండలం అతివృష్టి, అనావృష్టి లోనవుతుండటం ప్రత్యక్షంగా గమనించిన సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ఆనకట్ట నిర్మించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఆయన చేసిన ప్రతిపాదనకు 1846లో గోదావరి నదిపై ఆనకట్ట నిర్మాణానికి లండన్ డైరెక్టర్లు ఆమోదముద్ర వేశారు. నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై సర్ ఆర్థర్ కాటన్ గోదావరి తీర ప్రాంతాలను దర్శించారు. గోదావరి ఎగువ ప్రాంతమైన ప్రదేశాలను,పాపికొండల్లో గోదావరి ప్రవాహవేగాన్ని పరిశీలించారు. అలాగే పోలవరం వద్ద మహానంది, పొదలి కోన వద్ద గోదావరిలో లోతుపాతులను అధ్యయనం చేశారు .అశ్వాన్ని వాహనంగా చేసుకుని అరటి పండ్లనే ఆహారంగా చేసుకుని అహోరాత్రులు అవిరామంగా గోదావరి వరదలను అధ్యయనం చేశారు. రాజమహేంద్రి దిగువ గోదావరి ఇసుక తిప్పల తో నాలుగు పాయలతో వెడల్పుగా ఉన్న ప్రదేశాన్ని ఆనకట్ట కు అనుకూలంగా గుర్తించారు.ఈ ప్రదేశంలో ఆనకట్ట నిర్మాణానికి నిర్మాణ దశలో నది నీటిని ప్రదేశాలను గుర్తించి ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మాణానికి కాటన్ నిర్ణయం తీసుకున్నారు.దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో గోదావరి నదిపై ఆనకట్ట నిర్మాణానికి నివేదికను లండన్ కు పంపించారు. అక్కడికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు 1846లో రాజ ముద్ర వేసి ఆమోదించారు.1849లో బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఆనకట్ట నిర్మాణానికి నిధులు పూర్తిగా అందటంతో పనులు ముమ్మరం చేశారు.1852లో ఆనకట్ట కు మూడు అడుగుల తలుపులు అమర్చి సుమారు పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించి ఆనకట్ట నిర్మాణం పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించారు.సేద్యపు అవసరాలకు నీటి సరఫరా సరిపోకపోవడంతో 1862,67 ఏళ్ల మధ్య ఆనకట్ట ఎత్తును 2 అడుగులు పెంచారు. సస్యశ్యామల భారతావనికి తాగే నీరు,పారే నీరు భగీరథుడు సాధిస్తే,మన సర్కారు జిల్లాలను జలాలతో నింపిన అభినవ భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్.ఆయన సహాయ ఇంజనీరుగా దక్షిణ విభాగంలో పంబా జలసంధిని లోతు చేసేందుకు కృషి చేశారు. 1860లో పదవి విరమణ పొందినప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వంచే రాజ బంధువు బిరుదు పొంది ఆశేష మానవాళికి సాగు,తాగునీటి సదుపాయం కల్పించిన ప్రజా బంధువు కాటన్ .కాటన్ అంటే ఆనకట్టే..కరువు కు ఇంకా ఆట కట్టే…అనేలా ఒక అభినవ భగీరథుడు గా విశిష్టమైన పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారు కాటన్.

Advertisement

తాజా వార్తలు

Advertisement