రాష్ట్రంలో 33,966 ఉద్యోగాలను సృష్టించేందుకు రూ.85 వేల కోట్ల పెట్టుబడికి రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు (SIPB) ఆమోదం తెలిపింది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు తొలి సమావేశం మంగళవారం ఏపీ సచివాలయంలో జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారా లోకేష్, పలువురు మంత్రులు, అధికారులు హాజరయ్యారు.
ఈ సమావేశంలో మొత్తం 10 పరిశ్రమలకు రూ.85 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అనుమతించారు. అయితే పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపనకు ల్యాండ్ పూలింగ్ విధానం చేపట్టాలని ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఈ పరిశ్రమలకు భూములిచ్చిన వారికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అదే సంస్థలో ఉపాధి కల్పించేలా ప్రతిపాదనలు ఉండాలన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను గుర్తించేందుకు అగ్రిమెంట్లను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.