Saturday, June 29, 2024

AP: సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ నా విధానం… చంద్ర‌బాబు

అధికారులు ఫిజికల్ వర్చ్యువల్ పని విధానాలకు సిద్దపడాలి
కుప్పం అభివృద్ధికి సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి
కుప్పంలో రౌడీయిజం, హిసం, గంజాయి, అక్రమాలు కనిపించకూడదు
రాజకీయ ప్రోద్బలంతో పెట్టిన తప్పుడు రౌడీ షీట్లు ఎత్తేవేయండి
రాష్ట్రంలో పేదరిక నిర్మూళనకు కుప్పం నుండే శ్రీకారం : సీఎం చంద్రబాబు నాయుడు
కుప్పం, జూన్ 26 (ప్రభ న్యూస్): పేదరిక నిర్మూల‌నకు కుప్పం నియోజకవర్గం నుండే శ్రీకారం చుట్టబోతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పేదరికం లేని సమాజం కోసం వేసే తొలి అడుగు కుప్పం నుంచే మొదలు పెట్టనున్నట్లు తెలిపారు. పేదరికం లేని గ్రామం, మండలం, నియోజకవర్గంగా ముందు కుప్పాన్ని తయారు చేస్తామ‌న్నారు. దీని కోసం ఒక ప్రణాళికతో అధికారులు పనిచేయాలన్నారు. సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ తన విధామని అధికారులకు తెలియజేశారు. గత అడ్మినిస్ట్రేషన్ కు ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంబోతుందని సీఎం అన్నారు. అధికారులు ఫిజికల్ వర్చ్యువల్ పని విధానాలకు సిద్దపడాలన్నారు. బలవంతపు జనసమీకరణతో పెద్ద పెద్దమీటింగ్ లు, భారీ కాన్వాయ్ లతో సైరన్ల మోతతో హంగామాలు తమ ప్రభుత్వంలో ఉండవని చెప్పారు. సాయంత్రం 6 గంటల తర్వాత సమావేశాలు వద్దని మంత్రులకు కూడా ఇప్పటికే చెప్పానన్నారు. అధికారుల కూడా ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వాలి, ఎఫెక్టివ్ గా కార్యక్రమాలు ఉండాలని సీఎం సూచించారు. కుప్పం అతిధి గృహంలో చిత్తూరు జిల్లా, నియోజకవర్గ అధికారులతో బుధవారం సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు.

కుప్పంలో రౌడీయిజం, హింస, గంజాయి, అక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
రానున్న రోజుల్లో అమలు చేయబోయే ప్రణాళికపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కుప్పం సమగ్ర అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. తన ప్రాధాన్యం, ఆలోచనలు, నిర్ణయాలకు అనుగుణంగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు ప్రారంభించాలని సూచించారు. సమీక్షంలో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ… కుప్పంలో రౌడీయిజం, హింస, గంజాయి, అక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో కనిపించకూడదన్నారు. రాజకీయ ప్రోద్బలంతో పెట్టిన తప్పుడు రౌడీ షీట్లు ఎత్తి వేయాల‌న్నారు. రౌడీయిజం చేసే వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. గత 5 ఏళ్లు అధికారులు మనసు చంపుకుని పనిచేశారు. వైసీపీ నేతల పైశాచిక ఆనందానికి కొందరు అధికారులు సహకరించారన్నారు. నా సొంత నియోజకవర్గానికి నేను రాలేని, మాట్లాడలేని పరిస్థితిని గత ఐదేళ్లలో కల్పించారు. త‌నపైన హత్యాయత్నం కేసు పెట్టారు. 2019 వరకు త‌నపై ఒక్క కేసు కూడా లేదు. కానీ గత 5 ఏళ్లలో అక్రమ కేసులు అనేకంగా పెట్టారన్నారు. ప్రభుత్వ వ్యవస్థలు నాశనం అవ్వడంపై నేను చాలా బాధపడ్డానన్నారు. కుప్పంలో మళ్లీ ప్రశాంతమైన వాతావరణం రావాలని సీఎం చంద్రబాబు అన్నారు.

ప్రణాళికలు సిద్దం చేయండి.. మార్పు కనిపించాలి..
కుప్పం నియోజకవర్గంలో కొన్ని సమస్యలు సవాళ్లు విసురు తున్నాయి. తాగునీటి సమస్యను పరిష్కరించాలి. ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా ఇంటింటికీ తాగునీరివ్వడంతో పాటు, హంద్రీనీవా కాల్వ పనులు పూర్తికి ప్రణాళిక సిద్దం చేయండన్నారు. వ్యవసాయంలో మెరుగైన విధానాలు తీసుకురావాలి. డైరీ, మిల్క్, సిల్క్, హనీ ఉత్పత్తులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కుప్పానికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు తెస్తాం. ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థల ద్వారా కుప్పాన్ని ఎడ్యుకేషన్ హబ్ చేస్తామ‌న్నారు. యువతలో నైపుణ్యాన్ని లెక్కించేందుకు, అవకాశాలు కల్పించేందుకు, వారిలో నైపుణ్యం పెంచేందుకు ప్రత్యేక ప్రాణాలిక అమలు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. రైతులకు సబ్సిడీలు అందించడంపై దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం సూచించారు. ప్రతి డిపార్ట్ మెంట్ నుంచి పక్కా ప్రణాళికతో రావాలని నెలల వ్యవధిలోనే కుప్పంలో మార్పు చూపించాలని అధికారులకు, సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement