Tuesday, November 26, 2024

Simhachalam -అంగ రంగ వైభోగం అప్పన్న గజేంద్రమోక్షం… కనులారా వీక్షించిన భక్త జనం.

ఆంధ్రప్రభ.. విశాఖపట్నం బ్యూరో . దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో గజేంద్రమోక్షం ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.ప్రతీ యేటా కనుమ పండుగ రోజు సాంప్రదాయ బద్ధంగా నిర్వహించే ఈ ఉత్సవాన్ని ఈ ఏడాది కూడా ఆలయ ఈవో సింగం శ్రీనివాస మూర్తి ఆధ్వర్యంలో మంగళవారం అత్యంత ఘనంగా జరిపించారు.

మొసలి బారిన పడిన గజేంద్రుడిని ఆ శ్రీమన్నారాయణడు ఏ విధముగా రక్షించాడన్నది ఈ ఉత్సవము ద్వారా ఆలయ అర్చక వర్గాలు కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. ఉత్సవంలో భాగంగా తొలుత సిరిలొలికించే సింహాద్రినాథుడు ఉత్సవమూర్తి ప్రతినిధిగా గోవిందరాజ స్వామిని సర్వాభరణాలతో శ్రీమహావిష్ణువుగా చూడముచ్చటగా అలంకరించారు. అనంతరం అందంగా అలంకరించిన పల్లకిలో స్వామిని ఆశీనులు చేసి వేదమంత్రోచ్చరణలు మృదు మధుర మంగళ వాయిద్యాలు నడుమ మెట్లు మార్గం ద్వారా బోయిలు కొండ దిగువకు తీసుకువచ్చారు. అక్కడ సాంప్రదాయం ప్రకారం ఈవో ఎస్ శ్రీనివాస్ మూర్తి, సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు, దినేష్ రాజు, పలువురు అధికారులు, గ్రామ పెద్దలు స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి సాదరంగా గ్రామంలోకి ఆహ్వానించారు..

అక్కడి నుంచి నేరుగా తన సోదరి శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయానికి స్వామి చేరుకున్నారు. అక్కడ భక్తుల నుంచి మంగళ హారతులు, నీరాజనాలు స్వీకరించి ఉద్యానవనంకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ అందంగా అలంకరించిన ఉద్యాన మండపంలో స్వామిని ఆశీనులు చేసి శోడ శోపచారాలు, ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గజేంద్రుని మొసలి బారి నుంచి రక్షించే విధంగా ఏనుగు, మొసలి బొమ్మలు ఏర్పాటు చేసి తారాజువ్వలతో ఉత్సవాన్ని అత్యంత ఘనంగా వేలాదిమంది భక్తుల హరినామస్మరణల నడుమ నిర్వహించారు..

ఈ ఉత్సవంలో మూడు సార్లు కూడా తారా జువ్వలు ముందుకు వెళ్లి వెనక్కి రావడంతో భక్తులంతా కేరింతల నడుమ సంబరాలు జరుపుకున్నారు. అలా జరిగితే పాడిపంటలు సమృద్ధిగా పండుతాయని రైతాంగము ప్రగాఢ విశ్వాసం. ఉత్సవం పూర్తి కాగానే తిరిగి స్వామిని గ్రామము లో ఉన్న పుష్కరణి సత్రంలో ఆసీనులు చేసి ప్రత్యేక పూజలు జరిపారు. తదుపరి అందంగా తీర్చిదిద్దిన గజవాహనంపై స్వామిని ఆశీనులు చేసి గ్రామ తిరువీధి ఘనము గా నిర్వహించారు.

ప్రజలు తమ ఇళ్ల ముంగిట అందమైన ముగ్గులు వేసి స్వామిని సాదరంగా గ్రామములోకి ఆహ్వానించారు. మంగళ హారతులతో స్వామిని సేవించి దర్శించుకున్నారు. తిరువీధి పూర్తికాగానే తిరిగి స్వామి ని మెట్లు మార్గం ద్వారా బోయీలు కొండపైకి తీసుకువెళ్లారు. ఉత్సవ సారాంశాన్ని ఆలయ ఆస్థానాచార్యులు టి పి రాజగోపాల్ వివరించగా ప్రధాన అర్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు,అలంకార్ కరి సీతారామాచార్యులు,ఆలయ అర్చక పరివారం, ఎస్టీపీ రాజ గోపాల్,వేద పండితులు,అధ్యాపకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -

ఆలయ ఈవో ఎస్ శ్రీనివాస మూర్తి ఆధ్వర్యంలో భక్తులకు చేసిన ఏర్పాట్లు అందరి మన్ననలు పొందాయి . ఉత్సవం భారీగా విజయవంతం అయింది. ఆలయ ఏఈవో లు భ్రమరాంబ, రమణ మూర్తి, పి. నరసింగ రావు, పర్యవేక్షకులు పిల్లా శ్రీను, కనక రాజు అప్పన్న, అర్చక పరివారం వేద పండితులు , ఏసీపీ అన్నెపు నరసింహ మూర్తి పోలీస్ బందో బస్తు పర్యవేక్షించారు… కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషముగా అలరించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement