తిరుపతి (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో) : వచ్చే ఎన్నికలకు పార్టీ వర్గాలను సన్నద్ధం చేసే నిమిత్తం నిర్వహించే సిద్ధం సభల పరంపరలో భాగంగా రాయలసీమ ప్రాంతానికి సంబందించిన సభను ఫిబ్రవరి రెండో వారంలో అనంతపురంలో నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈరోజు తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన తిరుపతిలో సన్నాహక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో డిప్యూటీ సిఎం అంజాద్ బాషా, మంత్రులు ఉష శ్రీచరణ్, ఆర్కే రోజా, రాయలసీమలో 7 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మేల్యేలు, ఇంచార్జీల ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జిలు పాల్గొన్నారు.
సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమలో 7 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఇంచార్జీలతో సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలను తెలుసుకున్నామని చెప్పారు. ముందుగా అనుమతి తీసుకున్న ముగ్గురు తప్ప అనంతపురం, హిందూపురం, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల లోక్ సభ నియోజకవర్గాలను సంబంధించిన ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జ్ లు అందరూ పాల్గొన్నారని తెలిపారు.
అనంతపురంలో ఫిబ్రవరి రెండో వారంలో నిర్వహించ తలపెట్టిన సిద్దం సభకు ఐదు లక్షలకు పైగా జన సమీకరణ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా మూడు ఎమ్మెల్యే నియోజకవర్గాలను కూడా ఈసారి కైవసం చేసుకునేలా రాయలసీమలో కృషి చేస్తున్నామన్నారు. సత్యవేడు శాసనసభ్యుడు ఆదిమూలం తనపై చేసిన విమర్శల గురించి ప్రశ్నించగా.. ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని జవాబిచ్చారు. నేనెలాంటి వాడినో ప్రజలందరికీ తెలుసునని అన్నారు.
షర్మిల వేషం కాంగ్రెస్ ది – స్క్రిప్ట్ చంద్రబాబు ది మంత్రి రోజా
రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీ లో చేరి రాష్ట్ర అధ్యక్షురాలు అయిన వై ఎస్ షర్మిల వేషం కాంగ్రెస్ పార్టీ దే అయినా స్క్రిప్ట్ మాత్రం చంద్రబాబు దే అని స్పష్టం అవుతోందని రాష్ట్ర మంత్రి ఆర్ కే రోజా అన్నారు. ఈ రోజు తిరుపతి లో జరిగిన రాయలసీమలో నిర్వహింప తలపెట్టిన సిద్ధం సభ సన్నాహక సమావేశం లో పాల్గొనడానికి వచ్చిన ఆమె మీడియా తో మాట్లాడుతూ వైఎస్సార్ కుమార్తె అయిన షర్మిల తెలంగాణ లో పార్టీ పెట్టి యాత్రలు చేస్తున్నప్పుడు కొంత జాలి ఉండేదని , ఆ పార్టీ ని తెలుగు రాష్ట్రాన్ని విభిజించిన, వైఎస్సార్ కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేసిన కాంగ్రెస్ పార్టీ లో విలీనం చేసి ఆ పార్టీ నాయకురాలుగా వచ్చి మాట్లాడుతున్న మాటలకు అర్థం లేకుండా పోయిందన్నారు. ఒక విధంగా ఆమె నాలుగో కృష్ణుడు వంటి వారన్నారు..ఆమె వేషం మాత్రమే కాంగ్రెస్ పార్టీ దని మాట్లాడే మాటలన్నీ చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ లో ఉన్నవేనని అన్నారు
ఇక చంద్రభాబు తన హయాంలో ఎం చేసానో చెప్పుకోలేక మతి తప్పి మాట్లాడుతున్నారాణి రోజా విమర్శించారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన ఆయన తన గురిం చి మాట్లాడుతుండడం సిగ్గుచేటని అంటూ 10 ఏళ్లలో నేను ఒక్క రూపాయి తీసుకోలేదని అన్నారు. జగన్ గురించి విమర్శలు గుప్పిస్తున్న వారందరూ పక్క రాష్ట్రాల్లో కాపురాలు చేసుకునే వారు పండక్కి ఇంటికి వచ్చే అల్లుళ్ళ లాగా వచ్చి మాట్లాడుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. తాను ఒంగోలు నుంచి పోటీ చేస్తానని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, నా నియోజకవర్గం వదిలి ఎక్కడికీ పోవాల్సిన అవసరం లేదన్నారు. .మంత్రి పెద్దిరెడ్డి గురించి ఎం ఎల్ ఏ ఆదిమూలం మాటలాడిన మాటలు బాధ పెట్టాయని అంటూ ..వాస్తవానికి ఆయన్ను గెలిపించింది పెద్దిరెడ్డి అయితే ఆయన పైనే కక్ష సాధింపు గా మాట్లాడారని వ్యాఖ్యానించారు. ఆదిమూలం రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్టేనని అన్నారు. . సీట్లు కోల్పోయిన వారికి తప్పక న్యాయం జరుగుతుందని అన్నారు