ఐరాల ( పూతలపట్టు ), ప్రభ న్యూస్ :ఓ స్మగ్లింగ్ కేసులో దర్యాప్తు కోసం ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన పోలీసు బృందం ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పడంతో ఒక ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు దుర్మరణం పాలైనారు. చిత్తూరు జిల్లా పూతపలట్టు నియోజకవర్గం పి. కొత్తకోట సమీపంలో ఆదివారం వేకువజామున జరిగిన ప్రమాదంలో వారు ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు డి.ఎస్.పి. సుధాకర్ రెడ్డి కథనం ప్రకారం కర్ణాటక రాష్ట్రం శివాజీనగర్, ముల్బాగల్‌కు చెందిన ఎస్.ఐలు దీక్షిత్, అవినాష్, పోలీస్ సిబ్బంది శరవణ, బసవ, అనిల్ ఓ స్మగ్లింగ్ కేసు విషయమై తిరుపతికి బయలుదేరారు.
పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై రెండు కార్లలో వస్తూండగా పి. కొత్తకోట రైల్వే బ్రిడ్జి సమీపంలో ఒక కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ఆ వాహనంలో ప్రయాణిస్తున్న ఎస్‌ఐ దీక్షిత్, కానిస్టేబుళ్లు శరవణ, బసవ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలైన అవినాష్, అనిల్‌లను హుటాహుటిన 108 అంబులెన్స్ ద్వారా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్‌పీ రిశాంత్ రెడ్డి , డీఎస్‌పీ సుధాకర్ రెడ్డి, సీఐలు చిత్తూరు వెస్ట్ సిఐ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ఎస్‌ఐ మనోహర్ పర్యవేక్షించారు. అయితే ఈ ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండుకార్లలో బయలుదేరిన పోలీసుల్లో ఒక వాహనం ప్రమాదానికి గురైంది. రెండో వాహనంలోని సిబ్బంది ప్రవర్తనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.