తిరుమల, (ప్రభ న్యూస్) : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు మంగళవారం సాయంత్రం ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు. ఎఆర్.శేషాచలం దీక్షితులు కంకణభట్టర్‌గా వ్యవహరించారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ప్రాశస్త్యం.
ముందుగా బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారిని, పరివార దేవతలైన అనంత, గరుడ, చక్రత్తాళ్వార్, సేనాధిపతి వారిని, ధ్వజపటాన్ని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో టీటీడీ ఈవో ఎవి. ధర్మారెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో రమేష్ బాబు, పేష్కార్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.