ఎన్టీఆర్, ప్రభ న్యూస్ బ్యూరో : విజయవాడలో ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువుదీరిన అమ్మవారి ఆలయంలో శ్రావణమాసం సందడి నెలకొంది. శ్రావణ మాసం తొలి శుక్రవారం కావడంతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటి శుక్రవారం పెద్ద సంఖ్యలో అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసం మొదటి వారం నుండే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించుకొని అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. కృష్ణానది తీరాన ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో శ్రావణమాసాన్ని పురస్కరించుకుని అత్యంత వైభవంగా పూజలు జరుగుతున్నాయి.
దుర్గమ్మను దర్శించుకోవాలనే ఆనందంతో భక్తులు అమ్మవారి సన్నిధికి వస్తున్నారని దేవస్థానం ఈవో భ్రమరాంబ చెప్పారు. పెద్దఎత్తున తరలి వచ్చే భక్తుల కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. శ్రావణమాసం ఈనెల 28వ తేదీన వరలక్ష్మీ వ్రతంను పురస్కరించుకుని ప్రత్యేకంగా కుంకుమార్చనలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈనెల 30, 31, సెప్టెంబర్ ఒకటో తేదీన అమ్మవారి సన్నిధిలో పవిత్ర మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. శ్రావణ మాసాన్ని ఎంతో పవిత్రమైన మాసంగా భక్తులు భావిస్తారు. మహిళలు ఈ మాసం అత్యంత శుభ ప్రదమైనదిగా భావించి నోములు, వ్రతాలు నోచుకుని, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తుంటారని వైద్య కమిటీ సభ్యులు శివప్రసాద్ శర్మ తెలిపారు. ఇక పెళ్లిళ్లు తదితర శుభకార్యాలకు ఇది దివ్యమైన మాసం శ్రావణమాసం అన్నారు. ఈనెల రోజులు నగరంలో పండుగ వాతావరణం సంతరించుకుంటుంది.