Wednesday, November 20, 2024

Big Story | ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకుల కొరత.. విద్యార్ధుల్లో భయాందోళనలు

అమరావతి,ఆంధ్రప్రభ: డిగ్రీ విద్యలో ఈ ఏడాది నుండి ఉన్నత విద్యా మండలి భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు ఉన్న మూడు మేజర్‌ సబ్జెక్టులను తొలగించి ఈ ఏడాది నుంచి సిం గిల్‌ మేజర్‌ సిస్టమ్‌ను ప్రవేశపెట్టారు. అంటే గతంలో బిఎస్‌సి మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ అని మూడు మేజర్‌ సబ్జెక్ట్‌లు ఉండేవి. ఇక నుంచి ఒక మేజర్‌ సబ్జెక్టే ఉంటుంది. మరోకటి మైనర్‌గా తీసుకుంటారు. ఏదైతే మేజర్‌ సబ్జెక్టుగా తీసుకుంటారో దాంట్లో లోతుగా అధ్యయనం చేస్తారు. ఈ సిస్టమ్‌ వల్ల విద్యార్దులకు తొందరగా, మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో ఈ విధానం ఎప్పటి నుంచో అమల్లో ఉన్నప్పటికీ మన రాష్ట్రంలో ఈ ఏడాది నుండి అమలు చేస్తున్నారు. అయితే ఈ విధానాన్ని దశల వారీగా అమలు చేస్తే పెద్ద సమస్యలు ఉండేవి కాదు. కానీ ఉన్నత విద్యా మండలి అత్యుత్సాహం కారణంగా అన్ని కాలేజీల్లోనూ సింగిల్‌ మేజర్‌ సిస్టమ్‌ ఈ ఏడాది నుండే ప్రారంభించాలని నిర్ణయించారు. ఇప్పుడు ఈ నిర్ణయం ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో చేరాలనుకునే విద్యార్ధులకు శాపంగా మారబోతోంది. మరో వారం రోజల్లో డిగ్రీ కాలేజీల్లోకి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సింగిల్‌ మేజర్‌ సిస్టమ్‌పై ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఇప్పటి వరకు ఒక స్పష్టత రాలేదు. ఇప్పటికే ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకుల కొరత ఎక్కువగా ఉండి గెస్ట్‌ లెక్చరర్ల చేత బండి నడిపిస్తున్నారు. మరో వైపు సింగిల్‌ మేజర్‌ సిస్టమ్‌ వల్ల మరింత మంది అధ్యాపకుల అవసరమౌతారు.

తీవ్రం కానున్న అధ్యాపకుల కొరత
ఇప్పటికే ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అద్యాపకుల కొరత తీవ్రంగా ఉంది. ఈ కాలేజీల్లో 3,500 మంది పర్మినెంట్‌ లెక్చరర్లు ఉండగా మరో 713 మంది కాంట్రాక్ట్‌ పద్దతిన పని చేస్తున్నారు. వీరు కాకుండా దాదాపు 1200 మంది గెస్ట్‌ లెక్చరర్లు ఉన్నారు. అయితే పర్మినెంట్‌ లెక్చరర్లు లేకపోవడం వల్ల కాలేజీల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్‌ అందండం లేదు. దీనికి తోడు పోస్టులు ఖాళీగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఆ కాలేజీలకు ఫండ్‌ లేకపోవడంతో గెస్ట్‌ లెక్చరర్లను నియమించుకోలేని పరిస్థితి ఉంది. ఉన్నవాళ్ల మీదే పని భారం పెరిగి నాణ్యమైన బోధన పిల్లలకు అందడం లేదు. దీనికితోడు ప్రస్తుతం సింగిల్‌ మేజర్‌ సిస్టమ్‌ వల్ల మరింత మంది లెక్చరర్లు అవసరమౌతారు.

- Advertisement -

గతంలో మూడు మేజర్‌ సబ్జెక్టులకు ముగ్గురు లెక్చరర్లు ఉంటే సరిపోయేది. కానీ ఈ మూడు మేజర్లును ఒక్కొ సింగిల్‌ మేజర్‌గా పెట్టాలంటే మాత్రం తొమ్మిది మంది లెక్చరర్లు అవసరమమౌతారు. కొత్తగా లెక్చరర్ల నియామకం ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఒక వేళ నియామకం చేసినా దానికి మరో ఆరు నెలల సమయం పడుతుంది. అదీకాక కేవలం 404 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్‌ వస్తుందని అంటున్నారు. మరి సింగిల్‌ మేజర్‌ సిస్టమ్‌ను ఈ ఏడాది నుంచే అన్ని కాలేజీల్లో అమలు చేయాలంటే అధ్యాపకుల పరిస్థితి ఏంటనేది అర్ధం కావడం లేదు.

అగమ్యగోచరంగా సింగిల్‌ మేజర్‌ సిస్టమ్‌
ప్రతి విద్యార్ధి తన అభిరుచికి అనుగుణంగా తాను ఇష్టమొచ్చిన స బ్జెక్ట్‌లను మేజర్‌, మైనర్లు తీసుకునే అవకాశం కల్పించడమే జాతీయ విద్యా విధానం యొక్క లక్ష్యం. ఈ ఉద్దేశ్యంతో ప్రతి రాష్ట్రంలో డిగ్రీ విద్యలో సింగిల్‌ మేజర్‌ సిస్టమ్‌ను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అందులో భాగంగానే మన రాష్ట్రంలోనూ ఈ ఏడాది నుంచే సింగిల్‌ మేజర్‌ సిస్టమ్‌ను ప్రవేశపెడుతున్నారు. అయితే ప్రభుత ్వ కాలేజీల్లో మాత్రం జాతీయ విద్యా విధానం యొక్క స్పూర్తి కొనసాగేలా కనపడడం లేదు. అద్యాపకుల కొరత, మౌళిక సదుపాయల లేమీ అనే కారణాలతో సింగిల్‌ మేజర్ల కోర్సులను ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ల్లో కుదించేస్తున్నారు.

ఒక కాలేజీలో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ మూడు విభాగాల్లోనూ సింగిల్‌ మేజర్‌ సిస్టమ్‌ను అమలు చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం కొన్ని కాలేజీల్లో ఫిజిక్స్‌ను పూర్తిగా తప్పించేస్తున్నారు. మరికొన్ని కాలేజీల్లో మ్యాథ్స్‌ను పూర్తిగా తొలగించేస్తున్నారు. దీంతో పేద విద్యార్ధులు తమకిష్టమొచ్చిన కోర్సును ఎంచుకునే అవకాశాన్ని కోల్పొతున్నారు. ప్రభుత్వం ఆ కాలేజీల్లో ఏ కోర్సుల్లో సింగిల్‌ మేజర్‌ పెడితే అదే కోర్సును ఎంచుకోవాల్సిన పరిస్తితిలోకి నెట్టబడుతున్నారు. ఇక మైనర్‌ సబ్జెక్ట్‌ విషయంలోనూ విద్యార్ధులకు అన్యాయమే జరగబోతోంది. మేజర్‌ సబ్జెక్ట్‌ తర్వాత మైనర్‌గా ఏ సబ్జెక్ట్‌ను ఎంచుకోవాలనేది విద్యార్ధి ఇష్టానికి వదిలేయాలి. అదే నూతన విద్యా విధానం కూడా చెప్పేది. ఒక విద్యార్ధి ఎకనమిక్స్‌ను మేజర్‌ సబ్జెక్ట్‌గా తీసుకొని కంప్యూటర్‌ సైన్స్‌ను మైనర్‌గా తీసుకోదలిస్తే ఆ విద్యార్దికి ఆ అవకాశం ఉండాలి.

కానీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో జరగుతున్న కసరత్తు ప్రకారం మైనర్‌ సబ్జెక్ట్‌ ఏది తీసుకోవాలనేది కూడా కాలేజీనే నిర్ణయిస్తుంది. దీంతో విద్యార్ధికి నష్టం కలుగుతోంది. దీంతోపాటు గతంలో ఆరుగురు విద్యార్ధులుంటే ఆ కోర్సును కొనసాగించాలనే నిబంధన ఉండేది. ప్రస్తుతం సింగిల్‌ మేజర్‌ విధానంలో కనీసం 25 మంది విద్యార్ధులు ఉండాలనే నిబంధను పెడుతున్నారు. ఈ నిబంధన కూడా విద్యార్ధులకు అన్యాయం చేస్తోంది. కాగా సింగిల్‌ మేజర్‌ విధానం ఏంటీ, క్రెడిట్స్‌ ఎలా ఇస్తారు, ఎన్ని క్రెడిట్స్‌ ఇస్తే పాసవుతారు అనే విషయాలపై విద్యార్ధులకు అవగాహన కల్పించేందుకు ప్రాంతాల వారీగా విద్యార్ధుులతో సదస్సులు నిర్వహిస్తామని ఉన్నత విద్యా మండలి చెప్పింది. కానీ ఇంతవరకు చేయలేదు. మొత్తం సింగల్‌ మేజర్‌ సిస్ట మ్‌ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చేరబోయే విద్యార్ధుల్లో మాత్రం భయాందోళనలను కల్గిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement