Tuesday, November 19, 2024

Big story | ‘హైస్కూల్ ప్లస్‌’లో విద్యార్ధినుల కొరత.. కొన్ని కళాశాలల‌కే ప‌రిమితమైన సైన్సు గ్రూపుల

అమరావతి, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంతాల్లోని తల్లిదండ్రులు తాము పడిన బాధలు తమ పిల్లలు పడకూడదన్న లక్ష్యంతో వారి సంపాదనలో అధిక మొత్తం పిల్లల చదువుకోసమే ఖర్చు చేస్తున్నారు. ప్రైవేటు, కారోరేట్‌ కళాశాలలో తమ పిల్లల్ని చదివిస్తూ లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇట్లాంటి పరిసితుల్లో ప్రభుత్వం మండల స్థాయిలో కళాశాలలను ఏర్పాటు చేసి. ఏ హైసూల్‌లో 10వ తరగతి చదువుతున్నారో అదే స్కూల్‌లో ఇంటర్మీడియట్‌ విద్యను ఉచితంగా అందించాలని గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రయోగాత్మక ఆలోచనతో ప్రభుత్వం ‘హైస్కూల్‌ ఫ్లస్‌’ పేరిట గతేడాది బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

దీనివల్ల పదవ తరగతి చదివి ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఇంటర్‌ చదవలేని వారి సంఖ్య తగ్గించాలనే ఉద్దేశంతో కష్టతరమైన ప్రక్రియను చాలెంజ్‌గా తీసుకుని హైస్కూల్‌ ప్లస్‌ అనే కొత్త ప్రయోగానికి నాంది పలికింది. ప్లస్‌ వన్‌ కింద ఇంటర్మీయట్‌ మొదటి సంవత్సరం, ప్లస్‌2 కింద ద్వితీయ సంవత్సరాన్ని ప్రవేశపెట్టారు. దీనివలన పేదల చదువులకి మరింత భరోసా అవకాశం ఉందని చాలా మంది విద్యావేత్తలు దీనిని ఆనందంగా తీసుకువచ్చారు. కానీ ఆశించిన స్ధాయిలో కాకపోయినా కనీసం నామమాత్రంగానైనా విద్యార్థినులు చేరకపోవడం బాధాకరం.

- Advertisement -

విద్యార్ధులు వారు చదివిన పాఠశాలలో పదవ తరగతి చదివి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అదే పాఠశాలలో ఉన్న ఇంటర్మీడియట్‌లో చేరకపోవడం విడ్డూరం. రాష్ట్రంలోని ఆయా మండలాల్లో ఉన్న హైస్కూల్స్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తూ మండలానికి ఒకటి చప్పున 292 హైస్కూల్‌ ఫ్లస్‌ బాలికల కళాశాలలను 2021-2022 విదాసంవత్సరం మధ్యలో ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియట్‌ ప్రధమ, ద్వితీయ సంవత్సరం ప్రవేశపెట్టి, కొన్ని కళాశాలల్లొ ఆర్ట్స్‌, కొన్ని కళాశాలల్లో సైన్సు గ్రూపులను ఏర్పాటు చేశారు.

ప్రకాశం జిల్లా, చీమకుర్తి మండలంలో గతేడాది 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్ధినులు సుమారు 600 మంది ఉండగా, మండలంలో దేవరపాలెం హైస్కూల్‌ ప్లస్‌లో కేవలం మొదటి సంవత్సరంలో 15 మంది మాత్రమె చేరారు. వారందరూ ఈ యేడాది జరిగిన ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఫెయిల్‌ అయ్యారు. అలాగే గుంటూరు జిల్లా పొన్నెకల్లు మండలంలో గతేడాది సుమారు 350 మంది విద్యార్ధినులు హాజరుకాగా పొన్నెకల్లు హైస్కూల్‌ ప్లస్‌ వన్‌లో 21 మంది మాత్రమె చేరారు.

వీరు ఇంటర్మీయట్‌ మొదటి సంవత్సర ఫలితాల్లో అందరూ ఫెయిల్‌ కాగా సప్లీమెంటరిలో ఒక విద్యార్ధిని ఉత్తీర్ణత సాధించింది. ఎనీ ్ట ఆర్‌ జిల్లా, విరులపాడు మండలంలో గతేడాది సుమారు 130 మంది బాలికలు 10వ తరగతి పరీక్షలు రాయగా సమీపంలోని అల్లూరి హైస్కూల్‌ ప్లస్‌లో ప్రధమ, ద్వితీయ సంవత్సరాలు కలిపి 20 మంది విదార్ధినులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలా అన్ని జిల్లాల్లోని మండలాలలో ఉన్న హైస్కూల్‌ ప్లస్‌లలో విద్యార్ధినుల లేక బోసిపోతుండటంతో పాటు ఈ యేడాది ఇంటర్మీయట్‌లోలో వచ్చిన ఉత్తీర్ణతాశాతం దారుణంగా ఉంది.

పక్కదారి పడుతున్న వైనం:

కళాశాల విద్యకోసం ప్రస్తుత పరిస్థితుల్లో కార్పోరేట్‌ స్థాయిలో రూ లక్షలు ఖర్చవుతోంది. మండల స్ధాయిలో ప్రైవేటు జూనియర్‌ కళాశాలలు సంవత్సరానికి రూ 30 వేలు వరకు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్ధులతో కళకళలాడుతున్నాయి. రాష్టవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు మాత్రం విద్యార్ధులు లేక బోసిపోతున్నాయి. 10వ తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్ధులు హైస్కూల్‌లో చేరిన అనంతరం ఇంటర్మీడియట్‌ మొదటి సవంత్సరంలోనె పర్సంటేజ్‌ గణనీయంగా పడిపోవడంతో విద్యార్ధినులలో ఆందోళన రేకెత్తితిస్తోంది.

హైసూల్‌ ఫ్లస్‌ లను హైస్కూల్స్‌ ప్రాంగణంలోనే 9,10 తరగతుల మధ్య ఏర్పాటు చేయడం, ఫ్లస్‌ హైస్కూల్స్‌కు ప్రతేకంగా కాంపౌండ్‌ ఏర్పాటు చేసి ప్రత్యేక గుర్తింపు తీసుకురాకపోవడంతో విద్యార్ధినులలో తాము కళాశాల విద్యనభ్యసిస్తున్నామనే భావన కలగడం లేదు. ఇలా అనేక కారణాలతో హైస్కూల్‌ ప్లస్‌ నిర్వహణ సందిగ్ధంలో పడింది.

అధికారులలో చిత్తశుద్ధి లేమి..

ముఖ్యంగా గ్రామీణ ప్రాంత పేదలకు అత్యధిక వ్యయంతో కూడిన కళాశాల విద్యను పాఠశాలకు తీసుకువచ్చి ఉచితంగా అందించాలని ప్రభుత్వం తీసుకున్న చొరవకు తగినట్లుగా క్షేతస్థాయిలో అధికారులలో చిత్తశుద్ధి లోపించింది. విద్యార్ధుల నమోదు, బోధనా సిబ్బంది తక్కువగా ఉండటం, గత సంవత్సరం ఫలితాలలో వెనుకంజలో ఉండటం, ప్రచారం లేకపోవడం ఇలాంటి అనేక కారణాలతో హైస్కూల్‌ ప్లస్‌లో చేరడానికి విద్యార్ధులు ఆసక్తి చూపించలేదు. క్షేత్రస్థాయిలో ఉపాధాయులలో ఉన్న నిపుణులు, మేధావులు, విద్యారుల తల్లిదండ్రులు, స్థానిక పెద్దలతో కూడిన సలహా కమిటీ లేకపోవడం వంటి కారణాలు ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడుస్తున్నాయి.

సిబ్బంది నియామకంలోనూ…

ప్రభుత్వం హైస్కూల్‌ ప్లస్‌ ఏర్పాటు చేసిన తరువాతయ కొందరు స్కూల్‌ అసిస్టెంట్‌లను పిజిటిలుగా నియమించింది. రాష్ట్రంలోని కొన్ని కళాశాలల్లో విద్యార్ధినులకు సరిసమానంగా ఉపాధ్యాయులు ఉండటం వలన ప్రభుత్వంపై అదనపు ఆర్ధిక భారం పడుతుంది. ఎంపీసీ బైపిీసీ లాంటి సైన్సు గ్రూపులను అన్ని కళాశాలల్లో ప్రవేశపెట్టడం ద్వారా ఉపాధ్యాయులపై అదనపు భారం పడుతుందనె ఉద్ధేశ్యంతో ఆర్ట్స్‌ గ్రూపులతో సరిపెట్టారు. నేటి పోటీ ప్రపంచంలో సైన్సు గ్రూపులలో విద్యార్హత కలిగిన వారికె ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీని ప్రభావం వల్ల విద్యార్ధినుల సంఖ్య తగ్గుతుంది.

ఇలా చేస్తే మేలు…

  • పూర్వం బోధన, పిల్లల నమోదులో విజయవంతం ఉపాధ్యాయులు, అధికారులను గుర్తించి హైస్కూల్‌ ప్లస్‌ దత్తత బాధ్యతలు అప్పగించి ప్రోత్సాహకాలు ప్రకటించాలి
  • పోటీ పరీక్షలలో శిక్షణ ఇవ్వాలి
  • ప్రతిభ కలిగిన విద్యార్ధులను ఆకర్షించాలి
  • సబ్జెక్ట్‌ కొరత ఉన్నచోట ఔట్‌సోర్సింగ్‌ ఉపాధ్యాయులను నియమించాలి
  • అన్ని కళాశాల ఎంపిసి, బైపిసి గ్రూపులను ఏర్పాటు చేయాలి
  • గరిష్టంగా నూరుశాతం ఉత్తీర్ణత సాధించేలాఫలితాలను మెరుగుపరచాలి
  • అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, విద్యావంతులతో కలసి ఎంఈవో, హచ్‌ఎం స్థాయిలో సలహా లేదా అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేయాలి
  • ఉన్నత పాఠశాలలో చదివే విదార్ధినులు హైస్కూల్‌ ప్లస్‌లో చేరే విధంగా చొరవ తీసుకోవాలి
  • మండలస్థాయిలో ప్లస్‌ హైస్కూల్‌పై అవగాహన కల్పిస్తూ ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి

సందిగ్ధంలో విద్యార్ధినుల భవిష్యత్తు!

హైస్కూల్‌ ప్లస్‌ ఏర్పాటుచేసి రెండు సవంత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికైనా మెరుగైన చర్యలు తీసుకుని గాడిలో పెట్టి విజయవంతం చేయకుంటే ప్రభుత్వ ధ్యేయం అపజయంపాలై వింత ప్రయోగంగా మిగిలిపోతుంది. దీనివలన అధికారులు, ప్రభుత్వానికి నష్టంవాటిల్లకపోయినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్ధినుల భవిష్యత్తు సందిగ్ధంలో పడే ప్రమాదముంది. పాఠశాలలను అప్‌రగ్రేడ్‌ చేయడానికి ఎన్నో ప్రక్రియలుంటాయి. వాటన్నిటిని ప్రభుత్వం సులభతరం చేస్తూ ప్రభుత్వం కళాశాల విద్యను విద్యార్ధినుల ముంగిటికి తీసుకువచ్చింది. దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యావేత్తలు, ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరిది.

Advertisement

తాజా వార్తలు

Advertisement