Thursday, September 19, 2024

AP | ముంబై నటి జత్వానీ కేసు… ఆ ముగ్గురు ఐపీఎస్‌లకు షాక్ !

అమరావతి, ఆంధ్రప్రభ: దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న ముంబై సినీ నటి కాదంబరి జత్వానీ వ్యవహారంలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌లు నిండా మునిగిపోయారు. తనను అక్రమంగా అరెస్ట్‌ చేశారని, రిమాండ్‌ పంపడంతోపాటు తన కుటుంబంతో సహా కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారంటూ నటి జత్వానీ ఇచ్చిన ఫిర్యాదులో సదరు ఐపీఎస్‌లు మొదటి నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

దీంతో డీజీపీ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం, దాని ఆధారంగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, జగన్‌ సర్కార్‌లో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పనిచేసిన పి. సీతారామాంజనేయులు, గత ప్రభుత్వంలో విజయవాడ పోలీసు కమిషనర్‌గా విధులు నిర్వహించిన మరో సీనియర్‌ ఐపీఎస్‌ కాంతిరాణా టాటా, అదే సమయంలో విజయవాడ డీసీపీగా పనిచేసిన విశాల్‌ గున్నిలను సస్పెండ్‌ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయవాడ వెస్ట్‌ ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌ నాటి ఇన్‌స్పెక్టర్‌ ఎం. సత్యనారాయణరావులను ఇప్పటికే డీజీపీ సస్పెండ్‌ చేశారు. తాజా పరిణామంతో జత్వానీ కేసులో క్రమేణా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా రాష్ట్రంలో ఒకే వ్యవహారంలో ఒకేసారి ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌లపై ప్రభుత్వం వేటు వేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం.

గత ఎన్నికల సమయంలో పలువురు ఎస్పీలు, డీఐజీలపై ఎన్నికల సంఘం ఎన్నికల నియమావళి కింద చర్యలకు ఉపక్రమించినా.. ప్రభుత్వం ఏకకాలంలో ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌లను సస్పెండ్‌ చేయడం తొలిసారని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

అధికార దుర్వినియోగం, శాఖాపరమైన తప్పిదం, విధుల్లో నిర్లక్ష్యం, స్కాంలు, ఆర్థికపరమైన, ఇతరత్రా కారణాల కింద సస్పెన్షన్‌ వేటు పడటం జరుగుతుంది. కానీ ఇక్కడ పీఎస్సార్‌, కాంతిరాణా, విశాల్‌ గున్ని విషయానికొస్తే ఓ ప్రైవేటు వ్యక్త్తి, మహిళ ఫిర్యాదు మేరకు నమోదైన క్రిమినల్‌ కేసులో ఆరోపణలతో సస్పెండ్‌ కావడం ఐపీఎస్‌ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

- Advertisement -

కాగా ముంబైలో తాను పెట్టిన కేసును వెనక్కు తీసుకునేందుకు తనపై విజయవాడలో అక్రమ కేసులు బనాయించారని, కుక్కల విద్యాసాగర్‌ అనే వైసీపీ నాయకునితో ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌లో అక్రమ కేసు పెట్టించి తనను, తల్లిదండ్రులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపి ముంబై కేసు విత్‌డ్రా చేసుకోవాలని ఒత్తిడి తీసుకువచ్చి చిత్రహింసలకు గురిచేశారన్నది బాధితురాలు నటి జత్వానీ ప్రధాన ఆరోపణ.

గత ప్రభుత్వంలోని కొందరు పెద్దల సిఫార్సుతో రంగంలోకి దిగిన నాటి నిఘా బాస్‌ పీఎస్సార్‌, అప్పటి విజయవాడ సీపీ కాంతిరాణా టాటా, డీసీపీ విశాల్‌ గున్ని కనుసన్నల్లో పోలీసులు వ్యవహరించారని, తెర వెనుక పథకం రచించి పీఎస్సార్‌ కథ నడిపించారన్నది తీవ్ర ఆరోపణ.

ఈమేరకు విజయవాడ ప్రస్తుత సీపీ రాజశేఖరబాబు నియమించిన విచారణాధికారి స్రవంతి రాయ్‌ ఎదుట బాధితురాలు వెల్లడించిన అంశాలకు సంబంధించిన నివేదికను సీపీ ద్వారా డీజీపీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు మూడు రోజుల క్రితం ప్రభుత్వానికి నివేదించారు.

ఈ నివేదికలో సదరు ముగ్గురు ఐపీఎస్‌ల ప్రమేయాన్ని స్పష్టంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళారు. ఇదే సమయంలో బాధితురాలు ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం, దానిపై క్రైం నంబర్‌ 469/2024, ఐపీసీ 192, 211, 218, 220, 354 (డి), 467, 420, 469, 471, రెడ్‌విత్‌ 120 (బి) సెక్షన్ల కింద కేసు నమోదు కావడం, అప్పటికప్పుడే వెస్ట్‌ ఏసీపీ హనుమంతరావు, సత్యనారాయణలను సస్పెండ్‌ చేశారు.

కేసు నమోదు అంశాన్ని సైతం డీజీపీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. డీజీపీ నివేదిక ఆధారంగా సదరు ముగ్గురు ఐపీఎస్‌ల సస్పెన్షన్‌ ఫైల్‌పై సీఎం చంద్రబాబు సంతకం చేశారు. దీంతో సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ జీవో నెంబర్లు 1590, 1591, 1592 విడుదల చేశారు. కాగా ప్రభుత్వ వెబ్‌సైట్‌లో కాన్ఫిడెన్షియల్‌ అని పేర్కొనడం గమనార్హం.

విశాల్‌ గున్నీపై ఆంక్షలు..

నటి జత్వానీ కేసులో సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఐపీఎస్‌ అధికారి విశాల్‌ గున్నిపై ఆంక్షలు విధించింది. ఆయన్ను సస్పెండ్‌ చేయడానికి కారణాలను జీవోలో ప్రభుత్వం పేర్కొంది. నటి కాందంబరి జత్వానీపై విజయవాడ ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌లో 2024 ఫిబ్రవరి 2వ తేదీ ఉదయం 6.30 గంటలకు క్రైం నెంబర్‌ 384, 385, 386, 388, 420, 457, 468, 471, రెడ్‌విత్‌ 12(బి), ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదైంది.

ఈ కేసులో దర్యాప్తు పర్యవేక్షించడంలో అప్పుడు డీసీపీగా ఉన్న విశాల్‌ గున్నీ పూర్తిగా విఫలమయ్యారు. ప్రాథమిక విచారణ జరపకుండానే నటి జత్వానీని అరెస్ట్‌ చేసేందుకు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా అప్పటి ఇంటెలిజెన్స్‌ డీజీ పీ సీతారామాంజనేయులను 2024 జనవరి 31న కలిశారు.

ఆయన మౌఖిక ఆదేశాల ప్రకారం ఫిబ్రవరి 2న ముంబై వెళ్ళారు. ఎఫ్‌ఐఆర్‌ ఆరోజు ఉదయం ఆరున్నరకు నమోదు చేసి ఏడున్నర గంటలకు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి అధికారిక రాతపూర్వక ఉత్తర్వులు లేకుండా బయలుదేరి వెళ్ళారు. డీసీపీ హోదాలో అధికారిక విధుల కోసం వెళ్ళిన గున్నీ కనీసం అందుకు సంబంధించి ట్రావెల్‌ అలెవెన్స్‌ను ప్రభుత్వం నుంచి క్లెయిమ్‌ చేసుకోకపోవడంపై డీజీపీ నివేదికలో ఆక్షేపించింది.

అదేవిధంగా నటి అరెస్ట్‌ చేసే విషయంలో కనీసం వారికి ముందుగా తెలియపరచడం, నిబంధనలు పాటించలేదు. ఇదంతా నాటి పీఎస్సార్‌, విజయవాడ నాటి సీపీ కాంతిరాణా టాటా మౌఖిక ఆదేశాలతో చేసినట్లు నివేదికలో పేర్కొన్నట్లు జీవోలో పొందుపర్చింది. సస్పెండ్‌ చేస్తూ విశాల్‌ గున్ని విజయవాడ, హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలని, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా విడిచి వెళ్లరాదని ప్రభుత్వం జీవోలో ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement