తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పీఎస్ పరిధిలోని శిరోముండనం కేసులో హైకోర్టు నిందితులకు షాక్ ఇచ్చింది. కేసు కొట్టివేయాలని కోరుతూ నిందితులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసింది. అంతే కాకుండా గతంలో విచారణపై ఇచ్చిన స్టేను సైతం తొలగించింది.
వివరాలలోకి వెళితే 2020లోఇసుక రవాణాను అడ్డుకున్నాడంటూ సీతానగరం గ్రామానికి చెందిన ప్రసాద్‌ను కొందరు వ్యక్తులు రోముండనం చేశారు. అప్పట్లోనే నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిందితులలో ఎస్ ఐ కూడా ఉండటం విశేషం. ఈ కేసు విషయంలో స్వయంగా రాష్ట్రపతి జోక్యం చేసుకుని త్వరగా బాదితుడికి న్యాయం చేయాలని సంబంధిత అదికారులకు లేఖ కూడా రాశారు. కాగా ఈ కేసులో బెయిల్ పొందిన నిందితులు ఆరుగురు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేస్తూ కేసును కొట్టివేయాలని కోరారు. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఆ పిటిషన్‌ను కొట్టివేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.