(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : జగన్ జీవితం అబద్దాలమయం అని, జగన్ కి తెలిసింది ఒక్కటే డబ్బు సంపాదన అంటూ విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేసినేని శివనాద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డబ్బు కోసం ఎలాంటి దారుణాలకైనా వెనకాడడని, ఎవరి మనోభావాలు పట్టించుకోడన్నారు.
అందుకే తన పాలనలో కలియుగ దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించాడని ఆరోపించారు. తిరుపతి లడ్డు ప్రసాదాన్ని రాష్ట్రంలో ప్రజలందరూ మతాలకీ అతీతంగా క్రైస్తవులు, ముస్లిమ్స్ ఇష్టపడతారని. అందరీ మత విశ్వాసాలను దెబ్బతీసి, వారి మనోభావాలతో ఆడుకున్న జగన్ ను తక్షణం అరెస్ట్ చేయాలని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ డిమాండ్ చేశారు.
విజయవాడలోని తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ జగన్ పాలనలో అవినీతి తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ చేసేంతగా శృతి మించిందని మండిపడ్డారు. ఇప్పటి వరకు తిరుమలలో జరగని అపచారం జగన్ పాలనలో జరిగిందన్నారు.
ప్రధాన మంత్రి మోదీకి రాసే ఉత్తరంలో సిబిఐ ఎంక్వైయిరీ కోరతానన్న జగన్… ఆ విషయం ఎందుకు ప్రస్తావించలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ రాసిన ఉత్తరం చాలా హాస్యస్పదంగా వుందన్నారు. తను తప్పు చేయలేదని చెబుతున్న జగన్ దమ్ముంటే సిబిఐ ఎంక్వైయిరీ వేయించుకోని తన నిజాయితీ నిరూపించుకోవాలన్నారు.
లడ్డు కల్తీ విషయంలో ఆనాటి దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా బాధ్యుడేనన్నారు. మతాలకు అతీతంగా భక్తుల మనోభావాలు ఎవరైనా గౌరవించాలని, కానీ జగన్ మాత్రం తిరుమల ప్రతిష్టను కావాలనే అప్రతిష్ట పాలుజేశాడని మండిపడ్డారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసిన దోషులను రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కాదు.. ప్రజలు కూడా శిక్షించటానికి సిద్దంగా వున్నారని తెలిపారు.
జగన్ హయంలో తిరుమల ఆలయంలో లడ్డు కల్తీ విషయం ఒక్కటే కాదు.. ఎన్నో అపచారాలు, ఘోరాలు జరిగాయి.. వాటిన్నింటీని వెలికి తీసి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. జగన్ హయంలో రాష్ట్రంలో హిందు దేవాలయాలపై, చర్చ్ లపై , మజీద్ లపై జరిగిన దాడులపై ఆస్తుల ఆక్రమణ పై కమిటీ వేసి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు.
ఇక విజయవాడకి జలీల్ ఖాన్ నాయకత్వంలో హజ్ హౌస్ తీసుకువస్తే ఒక తట్టెడు మట్టి కూడా జగన్ వేయలేదన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి ఈవిషయం తీసుకువెళ్లి విజయవాడలో హజ్ హౌస్ ప్రారంభించేందుకు కృషి చేస్తామన్నారు. ఇక జగన్ మాటలు, డ్రామాలు నమ్మటానికి ప్రజలు సిద్దంగా లేరని తెలిపారు.
జగన్ అధికారం కోల్పోయిన నాటి నుంచి అధికారం కోసం తాపత్రయపడుతున్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ అర్ధమైందన్నారు. వరదల్లో కూడా బురద రాజకీయం చేసిన ఘనత జగన్ కే చెల్లుతుందన్నారు. ముంపు ప్రాంతాల్లో నీళ్లల్లోకి దిగకుండా రెండు నిమిషాలు పోటోషూట్ కి పోజులిచ్చి వెళ్లిపోయాడన్నారు.
గత ప్రభుత్వంలో జగన్ చేసిన ఆకృత్యాలు, అవినీతి చూస్తే రాష్ట్రం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఎమ్మెల్యే జగన్ వరద బాధితులకి కోటి రూపాయలు ప్రకటించి కమిటీ వేశాడు..ఆ కమిటీ ఎప్పుడు నిర్ణయిస్తుందో తెలియని పరిస్థితి వుందన్నారు.
విజయవాడ కి వచ్చిన వరదలు చూసిన రాష్ట్ర ప్రజలు విరాళాల రూపంలో సీఎం రిలీప్ ఫండ్ కు దాదాపు 400 కోట్ల రూపాయలు పంపించటం చూస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు పై రాష్ట్ర ప్రజలకు ఎంత నమ్మకం, విశ్వాసం పెట్టుకున్నారో అర్ధమవుతుందన్నారు.
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుందన్నారు. వరద కారణంగా ముంపుకి గురైన ప్రతి ఇంటిని సర్వే చేసి ప్రతి బాధితుడికి నష్టపరిహారం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయబడ్డాయన్నారు.
రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మొదటి సారిగా వరద బాధితుల్ని ఆదుకునేందుకు వందరకాల కేటగిరులు ఏర్పాటు చేసి అందరికీ నష్టపరిహారం వచ్చేలా ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. వరద కారణంగా విజయవాడలో ముంపుకి గురైన 32 డివిజన్స్ లోని రోడ్లు ,ఇళ్లు బురద తో నిండిపోతే 300 ఫైరింజన్స్ తో శుభ్రపర్చటం దేశంలోనే ప్రప్రధమన్నారు.
వరద కారణంగా నష్టపోయిన ప్రతి బాధితుడ్ని ఆదుకునే కార్యక్రమం దేశ చరిత్రలో మొదటిసారిగా సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రరాష్ట్రంలోనే జరుగుతుందన్నారు. విజయవాడలో కనకదుర్గమ్మ ఆలయంలో దేవి శరన్నవరాత్రుల ఉత్సవ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నట్లు ఓ ప్రశ్నకు ఎంపి కేశినేని శివనాథ్ బదులిచ్చారు.
అలాగే రాష్ట్రంలో తిరుమల తర్వాత అత్యంత ప్రసిద్దిగాంచిన దేవాలయం కనకదుర్గమ్మ ఆలయం.. ఈ ఆలయం రాష్ట్ర రాజధాని ప్రాంతంలో వుండటం నగరవాసుల అదృష్టం.. దసరా అనంతరం ఆలయాన్ని పరిశీలించి ఆలయ అబివృద్దికి చర్యలు తీసుకుంటామన్నారు.
ఆలయ అభివృద్దికి కేంద్ర పథకం ప్రసాద్ కింద వంద కోట్లు రూపాయలు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినట్లు తెలిపారు.ఈ సమావేశంలో రాష్ట్ర వాణిజణ్య విభాగ అధ్యక్షుడు డూండీ రాకేష్, టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతావుల్లాహ్, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ పాల్గొన్నారు.