Thursday, November 21, 2024

AP: శివయ్యకే పంగనామాలు…

రూ.1.20 కోట్లు దుర్వినియోగం
సొంత ఖాతాలోకి మళ్లించిన వైనం
విచారణ జరుపుతున్న అధికారులు
ఇప్పటికే ఆలయ దస్త్రాల పరిశీలన
నేడు మాజీ ఈవో బ్యాంకు ఖాతా వివరాలపై ఆరా


కర్నూలు బ్యూరో : దేవుని మాన్యములు, భూములను పరిరక్షించాల్సిన అధికారి.. నీతిమాలిన చర్యలకు పాల్ప‌డి ఏకంగా దేవుని సొమ్ముకే ఎసరు పెట్టాడు.. భక్తులు ఇచ్చిన కానుకలు, సొమ్ములతో పాటు దేవుని భూములపై వచ్చే మాన్యములను అడ్డదారిలో మళ్ళించాడు. దేవాదాయ శాఖ ఖాతాను కాదని తన సొంత బ్యాంకు ఖాతాకు తరలించాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా కోటి రూపాయలకు పైగా తరలించి కాల్వబుగ్గ ఆలయంకు చెందిన ఆ ముక్కోటికే పంగనామాలు పెట్టాడు. ఆ తర్వాత దర్జాగా ఆ సొమ్మును వినియోగించి తాను మరో దేవాలయంకు బదిలీ చేయించుకుని వెళ్లిపోయాడు.

అయితే కోట్ల రూపాయల సొమ్ము దారిమళ్ళిన వైనంపై ఆ శాఖ అధికార సిబ్బంది నోట.. బయటకు రాగా, అంతవరకు ఆదమరిచి నిద్రపోతున్న దేవాదాయ శాఖ అధికారులకు ఒక్కసారిగా కళ్ళు బైర్లు క‌మ్మాయి… ఇంకేముంది షరా మామూలే.. దారిమళ్లిన ఆలయ సొమ్ము పై విచారణ నిర్వహించగా విస్తుపోయే నిజాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

- Advertisement -

వివరాల్లోకి వెళితే ఇలా ఉన్నాయి… ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాల్వబుగ్గ దేవస్థానానికి భక్తుల నుంచి వివిధ రూపాల్లో సమర్పించిన నిధులను ఆలయ ఈఓ డీఆర్‌కేవి ప్రసాద్‌ హుసేనాపురం గ్రామీణ బ్యాంక్‌లో దేవస్థానం తరుపున వ్యక్తిగత ఖాతా సృష్టించి జమచేశాడు. ఆ నిధుల్లో రూ.1.20 కోట్లను దశల వారీగా స్వాహా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ సుధాకర్‌రెడ్డి ఆలయానికి చేరుకుని రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ భూములు, వివిధ వ్యాపారాలకు సంబంధించిన నిధులను మాజీ ఈఓ తన వ్యక్తిగత ఖాతాకు జమ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

దీంతో కంగుతిన్న అధికారులు ఈ విషయంపై పూర్తిస్థాయిలో విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మాజీ ఈవో కు సంబంధించిన బ్యాంక్‌ ఖాతాలో లావాదేవీలను మంగళవారం పరిశీలించనున్నట్లు కర్నూలు దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్ రెడ్డి వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement