Monday, November 18, 2024

Weather Alert: వణికిస్తున్న వాయుగుండం.. వర్షాలకు తోడైన చలిగాలులు

అమరావతి, ఆంధ్రప్రభ: వాయుగుండం వణికిస్తోంది. సోమవారం ఏపీలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఉదయం నుంచి వాతావరణం కూల్‌గా మారడంతో పాటు చలి తీవ్రత ఎక్కువైంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండము జాఫ్నాకు ఈశాన్యంగా 520 కి.మీ.(శ్రీ లం), కారైకాల్‌కు తూర్పు ఈశాన్యంగా 470 కి.మీ, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 550 కి.మీ మరియు చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 420 కి.మీ.వద్ద కేంద్రీకృతమై ఉంది. సాయంత్రానికి వాయువ్య దిశగా కదులి అర్ధరాత్రి సమయానికి అదే తీవ్రతను కొనసాగిస్తూ పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు.

అనంతరం పశ్చిమ వాయువ్య దిశగా దక్షిణ ఆంధ్ర ప్రదేశ్‌ ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి వైపు కదులుతూ ఆ తీరప్రాంతాల వద్ద క్రమంగా బలహీనపడి మంగళవారం ఉదయం బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతంగా మారుతుంది. దీని ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్‌, యానాంలలో దిగువ ట్రోపోస్పిరిక్‌ స్థాయీలలో ఈశాన్య గాలులు వీస్తున్నాయి. సోమవారం అత్యధికంగా ఒంగోలులో 3మి.మీ, తిరుపతిలో 2 మి.మీ బాపట్లలో 1మి.మీ, గన్నవరంలో 0.9 మి.మీ, కావలిలో 0.8 మిమీ అమరావతిలో 0.7 మి.మీ, మచిలీపట్నంలో 0.6మి.మీ కాకినాడ, కళింగపట్నం ప్రాంతాల్లో 0.5 మిమీ, తునిలో 0.4, నంధ్యాలలో 0.2 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.

మంగళవారం ఉత్తర కోస్తాలో ఓ మోస్తరు వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉరుములు, మెరుపులతో కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కల్లాల్లో ధాన్యపురాశులు నిల్వ ఉండటంతో రైతాంగంలో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈక్రమంలో కల్లాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు సంబంధిత అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. జిల్లా కలెక్టర్ల సూచనల మేరకు వ్యవసాయ, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు ధాన్యం తరలింపు కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement