Friday, November 22, 2024

AP: వర్షాలు ముంచేశాయి.. ఆదుకోండి.. చంద్రబాబుకు షర్మిల లేఖ

రాష్ట్రంలో ఇటీవల భారీ వర్షాలు, వరదలతో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి వారిని ఆదుకోవాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. ముఖ్యంగా, కోస్తా జిల్లాల్లో వర్షాలు, వరదలతో రైతులు అతలాకుతలం అయ్యారని తెలిపారు. కాలం చెల్లిన, అస్తవ్యస్తంగా మారిన కాలువల నిర్వహణ కారణంగా పంట పొలాలు నీట మునిగాయని, తీవ్ర స్థాయిలో పంట నష్టం జరిగిందని షర్మిల వివరించారు.

“వరద ప్రభావిత ప్రాంతాల్లోని రైతుల దుస్థితి పట్ల మీ క్యాబినెట్ సహచరులు కానీ, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ ఒక్కరు కూడా మాట్లాడకపోవడం నిరాశ కలిగించింది. మీ ప్రభుత్వం గుప్పించిన హామీలు, వాగ్దానాలకు… మీరు వ్యవహరిస్తున్న తీరు విరుద్ధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని గట్టిగా కోరుతున్నది ఏంటంటే… రైతుల కష్టాలను రాష్ట్ర ఎమర్జెన్సీగా ప్రకటించండి. రైతులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి, తగిన నష్టపరిహారం చెల్లించేందుకు వీలుగా వెంటనే పలు బృందాలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి పరిశీలనకు పంపండి.

కాలువల నిర్వహణ సరిగా లేకపోవడం వల్లే పంట పొలాల మునకకు దారితీసింది. గత ప్రభుత్వం కాలువల నిర్వహణను విస్మరించింది. కాలువల మరమ్మతులకు ఉద్దేశించిన నిధులను గత ప్రభుత్వం దారిమళ్లించింది. వెంటనే కాలువల మరమ్మతులకు నిధులు కేటాయించాలని మీ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంతేకాదు, గత ప్రభుత్వం రైతులకు ధాన్యం సేకరణ బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేసింది. ఇప్పుడు వర్షాలు, వరదలతో సతమతమవుతున్న ఆ రైతులకు బకాయిలు కూడా చెల్లించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం” అని షర్మిల తన లేఖలో వివరించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement